ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, డిసెంబర్ 20 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటూ స్థానిక శ్రీనిధి డీఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తొర్రం వెంకటలక్ష్మి (19) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందింది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం అందుగులపల్లికి చెందిన వెంకట లక్ష్మి వారంక్రితం డీఎడ్ పరీక్షల కోసం రాగా, శుక్రవారం మధ్యాహ్నం భోజన చేసిన అనంతరం అస్వస్థతకు గురైంది.
తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది కలిసి స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతికి గల కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం తర్వాతే స్పష్టత వచ్చే అవకాశమున్నది. వెంకటలక్ష్మి అనారోగ్యంతోనే మృతి చెంది ఉండవచ్చని బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్ తెలిపారు. హాస్టల్ వార్డెన్ వారం రోజులుగా అందుబాటులో ఉండడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు.