మంచిర్యాల అర్బన్, జూన్ 27 : ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడికి చెందిన కుమ్మరి స్వప్న (19) బీజెడ్సీ సెకండియర్ చదువుతున్నది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం భవనంపై నుం చి పడి తీవ్రగాయాలు కాగా, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు.
అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. విద్యార్థిని మృతిపై బంధువులు, గ్రామస్థులు, కాగాజ్నగర్ బీఆర్ఎస్ పార్టీ, కుల సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. స్వప్న మృతిపై అనుమానం ఉందని, కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని ప్రాణం పోయిందని మండిపడ్డారు. రెండు నెలల క్రితం ఓ విద్యార్థిని ఇదే కళాశాల భవనంపై నుంచి దూకి మృతి చెందిందని, ఆ ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులు పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.