తాడూరు, జనవరి 20 : విద్యుదాఘాతం తో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇంద్రకల్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభం తీగకు 9వ తరగతి విద్యార్థి లోకేశ్ (14) చేయి తగలడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థిని చికిత్స కోసం నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి జిల్లా దవాఖానకు చేరుకొని విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గతంలో కూడా స్తంభానికి ఉండే విద్యుత్తు తీగకు కరెంట్ సరఫరా అవుతుందని ఉపాధ్యాయులకు, విద్యుత్తు అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.