ఆత్మకూరు, జూన్ 30 : హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి (14) మల్కపేట గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నది. సోమవారం బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. శ్రీవాణిని చికిత్స నిమిత్తం పరకాల దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కూతురు మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఐదో తరగతి నుంచి తమ కూతురు ఇక్కడే చదువుతున్నదని ప్రధానోపాధ్యాయురాలు తోటి విద్యార్థుల ముందు తిట్టడం వల్లే మనస్తాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడిందని శ్రీవాణి తల్లిదండ్రులు రజిత-ఈశ్వర్ ఆరోపించారు. ఆత్మహత్యకు ప్రధానోపాధ్యాయురాలే కారణమంటూ కుటుంబసభ్యులు, బంధువులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
శ్రీవాణిది ప్రభుత్వ హత్యేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు. శ్రీవాణి కుటుంబానికి అండగా ఉంటామని, పూర్తి విచారణ జరిపి బాధ్యులను శిక్షించే వరకు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.