రాయపర్తి, జూన్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా గత ఏడాదిన్నరగా విసిగిపోయారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మైలారం గ్రామ శివారు చక్రుతండాకు చెందిన రాయపర్తి మాజీ ఎంపీపీ గుగులోత్ విజయానామా నాయక్ సహా చక్రుతండా, గన్నారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజిడి గజేందర్‌రెడ్డి, అయిత ప్రవీణ్‌కుమార్, పాడిచర్ల రాకేశ్‌తోపాటు సుమారు 25 మంది బీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం, మంత్రులకు సఖ్యత లేదని, పూటకో మాట, గడియకో నిర్ణయంతో రేవంత్ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని, గ్రామాల్లో గులాబీ శ్రేణులకు అపూర్వ ఆదరణ లభిస్తున్నదని తెలిపారు.