హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నదని, దీంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘మహాలక్ష్మి-మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు’ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులను చేసినట్టు చెప్పారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2,800 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తున్నదని తెలిపారు. అనంతరం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు.
హైదరాబాద్, జూలై23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వివాదంలో కేంద్ర పార్టీ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. ఢిల్లీలో బుధవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అన్నాక గొడవలు సర్వసాధారణమని, ఈ విషయంలో అధిష్ఠానం పెద్దలు మాట్లాడాలని సూచించారు. పాత, కొత్త రాష్ట్ర అధ్యక్షులు కలిసి ఈటల, బండి విషయంలో మాట్లాడాలని కోరారు. రాజాసింగ్ అంశమై స్పందిస్తూ.. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదని, రాజీనామా చేశారని గుర్తుచేశారు.