హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సచివాలయ ఆవరణలో వీధి కుక్కలు విహారం చేస్తున్నాయి. పరిసరాల్లో తిరుగుతూ సందర్శకులు, సిబ్బ ందిపై తరచుగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే నలుగురిపై దాడి చేసిన కుక్కలు శనివారం సాయంత్రం పనిమీద సెక్రటేరియట్‌కు వచ్చిన ఓ మహిళను తీవ్రంగా గాయపరిచాయి.
శునకాల బెడదతో అక్కడి రహదారిపై నుంచి వెళ్లేందుకు పాదచారులు, సెక్యూరిటీ సిబ్బంది భయపడుతున్నారు. పెట్రేగిపోతున్న కుక్కలతో ఉద్యోగులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న సచివాలయంలో పరిస్థితిపై అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.