పరకాల, జనవరి 17: తమ భూములను బలవంతంగా తీసుకుని నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి పచ్చని పంటపొలాలను కేంద్ర ప్రభుత్వం గుంజుకుంటుందని, ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్నట్టు తెలిపారు. కాని అధికారులు హైకోర్టులో కేసు విషయాన్ని పట్టించుకోకుండా రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసు పూర్తయ్యే వరకు రైతుల భూములు విషయంలో అధికారులు ఆగాలని, లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.