హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటంలో ముందువరుసలో నిలిచిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసి వారి స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని కోరారు. బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నలమల్ల గిరిప్రసాద్ విగ్రహాలను వారి జిల్లాల కూడళ్లలో ప్రతిష్ఠించి సముచిత గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సహాయనిధికి గీతం యూనివర్సిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం గీతం వర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీభరత్ చెక్కు అందజేశారు. కాగా, సికు మత స్థాపకుడు గురునానక్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు.