మెహిదీపట్నం, జూలై 3: విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది స్టూడెంట్లను ఏకంచేసి ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 7న చలో ఇందిరా పార్క్ విద్యార్థుల సమరభేరి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిని విద్యార్థులు శుక్రవారం ముట్టడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బయటకు రావాలంటూ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని, పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జీవోల పేరిట, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్న ప్రభుత్వం జీవో ఎంఎస్ 8,9ని రద్దు చేసి తక్షణమే రూ.10వేల కోట్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, ప్రధాన కార్యదర్శి నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలి ముట్టడి ఉద్రిక్తం
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ తలపెట్టిన ఉన్నత విద్యామండలి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు మాసబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయాన్ని ముట్టడిం చారు. విద్యార్థులు మండలి కార్యాలయంలోకి చొచ్చు కెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ జీవో 8, 9లపై కోర్టు స్టే విధిస్తే కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారని, అడ్మిషన్లు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. జీవోలు రద్దుచేసి, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.