Caste Census | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తున్నది. కానీ, ఆ సర్వే నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు చట్టం ముందు నిలవబోవని బీసీ సం ఘాలు, మేధావి వర్గాలు కొట్టిపడేస్తున్నాయి. ఈ సర్వే కోసం రేవంత్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న విధానం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటూ.. బీహార్, మహారాష్ట్రల ఉదంతాలను ఉదహరిస్తున్నా యి. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించేందుకే కాంగ్రెస్ స ర్కారు నిబంధనలకు విరుద్ధంగా ఈ సర్వే చేపడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చట్టానికి, ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలకు విరుద్ధంగా..
1948లో వచ్చిన చట్టం ప్రకారం జనగణ న, కులగణన చేపట్టే అధికారం కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ చే సినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు గనుక అమలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రమైనా జనగణన నిర్వహించాలంటే చట్ట సవరణ తప్పనిసరని న్యాయకోవిదులు స్పష్టం చేస్తున్నారు.
వాస్తవానికి స్థానిక ఎన్నికల్లో జనాభా దా మాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం లాటరీ, ర్యాండమ్ లాంటి అశాస్త్రీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలే నామమాత్రంగా రిజర్వేషన్లు కల్పిస్తుండటంతో వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై గతంలో కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గావ్లీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను, ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చే యాలి. ఆ కమిషన్ ద్వారానే బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలి. ఆ రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నదని కులసంఘాలు, బీసీ మేధావి వర్గాలు మండిపడుతున్నాయి.
ప్లానింగ్ విభాగం చేయడమేంటి?
సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ మాత్రమే వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం నిర్వహించి, దాని ఆధారంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. కానీ, ఇక్క డ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీహార్ తరహాలో డాటా కలెక్షన్ ప్లానింగ్ బాధ్యతలను డిపార్ట్మెంట్కు అప్పగించింది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. డాటా కలెక్షన్‌కు కావాల్సిన మానవ వనరులు, ఇతర వసతులు బీసీ కమిషన్‌కు లేవని చెప్తున్నది. ఇది వాస్తవమే అయినప్పటికీ డాటా కలెక్షన్ కోసం నోడల్ ఏజెన్సీగా బీసీ కమిషన్‌కు ప్లానింగ్ డిపార్ట్మెంట్ను అటాచ్ చేసే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు.
డాటా కలెక్షన్‌ను పూర్తిగా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కే అప్పగించింది. ఈ మేరకు ఈ నెల 10న జీవో 18ని విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఎక్కడా స్పష్టమైన వివరాలను పేర్కొనలేదు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులాల వారీగా అని మాత్రమే పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నామనేది ఎక్కడా పేర్కొనలేదు. ఫిబ్రవరిలో క్యాబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలను మాత్రమే రెఫరెన్స్‌గా ఇచ్చింది. కానీ, సమగ్ర ఇంటింటి సర్వే కోసం బీసీ సంక్షేమశాఖ మార్చిలో జారీ చేసిన జీవో 26ను మాత్రం ఎక్కడా రెఫర్ చేయలేదు. ఇవీ కాకుం డా బీసీ కమిషన్‌కు టీవోఆర్లను నిర్దేశిస్తూ జీవోలను విడుదల చేసింది. వాటిని కూడా రెఫర్ చేయలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన ఉత్తర్వులు అస్పష్టంగానే ఉన్నాయని బీసీ మేధావి వర్గం మండిపడుతున్నది.
బీహార్, మహారాష్ట్ర తరహాలోన్యాయచిక్కులు తప్పవు
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా జారీ చేస్తున్న మార్గదర్శకాలతో న్యాయచిక్కులు తప్పవని బీసీ న్యాయకోవిదులు హెచ్చరిస్తున్నారు. అందుకు బీహార్, మహారాష్ట్రను ఉదహరిస్తున్నారు. గతంలో బీహార్ ప్రభుత్వం ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో కులగణనను నిర్వహించింది. తద్వారా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలను తీసింది. తదనుగుణంగా ఆయా వర్గాల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. దానికి ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగాయి. దీంతో గతంలో సుప్రీంకోర్టు విధించిన 50% కోటా పరిమితి మించిపోయిందని, బీహార్ ప్రభు త్వం నిర్వహించిన కులగణననే చెల్లుబాటు కాదని పేర్కొంటూ అనేక మంది పాట్నా హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు పెండింగ్‌లో ఉన్నది.
చివరికి సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బీహార్ ప్రభుత్వం తన సర్వే నివేదికను వెల్లడించలేదు. ఇదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలకు విరుద్ధంగా డెడికేషన్ కమిషన్‌ను కాదని డాటా కలెక్షన్ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. దీనికి సుప్రీంకోర్టు అడ్డుచెప్పడంతో మళ్లీ కమిషన్ ద్వారానే డాటా కలెక్షన్ చేయించింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ, జనగణన నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేనందున ఆ సర్వే వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వెల్లడించలేదు. డెడికేటెడ్ కమిషన్లు కాకుండా ప్రభు త్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు గతంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సర్వేను ఉదహరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ హడావుడిలో ఆంతర్యమేంటి?
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆయా రాష్ర్టాల తరహాలోనే ముందుకు సాగుతుండడంపై కులసంఘాలు, మేధావి వర్గాలు అనుమానాలను వ్య క్తం చేస్తున్నాయి. ఈ హడావుడి వెనుక అంతర్యమేంటని ప్రశ్నిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. ఈ అంశాన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడేయాలన్న భావనతోనే రేవంత్‌రెడ్డి సర్కారు నిబంధనలకు విరుద్ధంగా సర్వేను చేపట్టేందుకు సిద్ధమైందని బీసీ మేధావి వర్గం విమర్శిస్తున్నది.