Telangana | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పదేండ్లుగా ఏటికేడు గణనీయ వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక రంగానికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమన దిశగా సాగుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వచ్చిన ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే.. కమర్షియల్ ట్యాక్స్ మినహా మిగతా శాఖల్లో నెగిటివ్ వృద్ధి రేటు నమోదైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని స్పష్టంచేశారు. రాష్ట్ర పరిస్థితిని గణాంకాలతో సహా వివరించారు.
కమర్షియల్ ట్యాక్స్‌లో మాత్రమే..
రాష్ట్రానికి కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మైనింగ్, వెహికల్ ట్యాక్స్ విభాగాల ద్వారా ప్రధానంగా ఆదాయం వస్తుంది. గత ఏడు నెలల్లో ఒక కమర్షియల్ ట్యాక్స్ మినహా .. మిగతా అన్ని విభాగాల్లో నెగిటివ్ వృద్ధి నమోదైంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతో పోల్చితే.. ఆదాయాన్నిచ్చే శాఖలు ఈ ఏడాది కనీసం 8-10% వృద్ధితో దూసుకుపోవాల్సి ఉన్నది. కానీ, మైనింగ్, వెహికల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖలో సగటున 2% లోటు నమోదైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 1% లోటు నమోదైంది. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో మాత్రమే 7.5% వృద్ధి కనిపించింది. అయితే ఇది సహజంగా పెరిగింది కాదని.. పారిశ్రామిక బకాయిలు, ఇతర పెండింగ్ అంశాలకు సంబంధించి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్లు ఇతర మార్గాల్లో ప్రయత్నించడంతో ఇది సాధ్యమైనట్టు చెప్తున్నారు.
ఇలాగే ఉంటే కష్టమే
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ప్రభుత్వానికి కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం సృష్టించడంపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ హడావుడి చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు.