Telangana | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్ధత నెలకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.5,280 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు పడిపోయిన సంగతి తెలిసిందే. నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది. తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొవిడ్ సంక్షోభం తర్వాత
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కనబరిచింది. ఏటికేడు వసూళ్లు పెరిగాయి. అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది. 2020లో కొవిడ్ విపత్తు కారణంగా లాక్డౌన్ ప్రకటించడం, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 2021 ఫిబ్రవరి వసూళ్లలో -1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే వృద్ధిరేటు మందగించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని నిపుణులు మండిపడుతున్నారు. కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెప్తున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, పెట్టుబడి సాయం అందించక, సరైన సమయంలో పంట కొనుగోళ్లు చేయక వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నదని అంటున్నారు. ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిల్లాడుతున్నదని చెబుతున్నారు. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిరేటు నమోదు కావడం లేదని, పరిశ్రమలు వెళ్లిపోతున్న పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు. ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతింటుండటంతో దేశంలోనే అతి తక్కువ జీఎస్టీ వసూళ్ల వృద్ధితో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని చెప్తున్నారు.
కేంద్ర నివేదిక ప్రకారం..