2024-25 బడ్జెట్లో ఫిబ్రవరి నెలకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం అంచనా రూ.18,228.82 కోట్లు
ప్రభుత్వానికి వచ్చిన రాబడి రూ.7,033.38 కోట్లు
ఆదాయం శాతం: 38.58 నిరుడు ఇదే నెలలో వచ్చిన ఆదాయ శాతం: 70.16
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహనరహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది. కరోనాకాలం నాటి కంటే కూడా రాబడి తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయవనరు అయిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం ఘోరంగా పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఈ శాఖ ఆదాయం 38 శాతమే నమోదైంది. ఇంత దారుణంగా స్థిరాస్తి రాబడి పడిపోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ఇంతటి తగ్గుదల కనిపించలేదు.
నాడు రియల్ రాబడి 42 శాతానికిపైగా నమోదైంది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (ఎస్వోటీఆర్) కూడా పడిపోయింది. 2023-24లో రూ.1,24, 146. 19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గింది. అంటే.. రూ.91.81 కోట్ల తగ్గుదల నమోదైంది. కాగ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఫిబ్రవరి నెల గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. రెవెన్యూ ఆదాయం ఫిబ్రవరి వరకు రూ.2,21,242.23 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ, రూ.1,36,136.01 కోట్ల ఆదాయమే సమకూరింది.
అంటే రేవంత్‌రెడ్డి సర్కారు నిర్దేశించుకున్న ఆదాయం లక్ష్యంలో 61.53 శాతానికి పరిమితమయ్యారు. గత ఏడాది ఇదే కాలానికి రూ.2,16,566.97 కోట్లు రాబడి అంచనా వేయగా, రూ.1,51,947.05 కోట్లు మేరకు చేరుకున్నారు. అంటే లక్ష్యంలో 70.16 శాతం అందుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు రూ.1,93,029.40 కోట్ల ఆదాయం అంచనా వేయగా, రూ.1,33,850.82 కోట్లకు అంటే.. లక్ష్యం 69.34 శాతం మేరకు చేరారు. రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం ఆదాయ రాబడిలో చతికిలబడుతున్నది.
కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి నేలకరిచింది. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి ఏడాది క్రమంగా పెరుగుతూ వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం, రేవంత్‌రెడ్డి పాలనలో క్రమంగా తగ్గుముఖం పట్టింది. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న హైడ్రా, ఎల్ఆర్ఎస్ వంటి అనాలోచిత చర్యలతో రియల్ ఆదాయం పడిపోయింది. భూములు అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో బిజినెస్ మందగించింది. రాష్ట్ర ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని 40 శాతం కూడా అందుకోలేకపోయింది. బడ్జెట్లో ఫిబ్రవరి నెల ఆదాయం రూ.18,228.82 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కానీ, రూ.7,033.38 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాబడి 38.58 శాతం వద్దే నిలిచిపోయింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల (ప్లాట్ల) అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. కేసీఆర్ పాలనలో గడిచిన పదేండ్లలో ఏనాడూ రియల్ రాబడి తగ్గలేదు. పైగా క్రమంగా పెరిగింది. పదేండ్లలో తొలిసారి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం నిర్దేశించిన లక్ష్యంలో సగానికి కూడా చేరలేకపోయింది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖనే రాష్ట్ర ఖజానాకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. నాటి సీఎం కేసీఆర్ వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, గృహ నిర్మాణ రంగాల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారు. తద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. 2014 తర్వాత రియల్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. గతంలో రూ.10 లక్షలకు ఎకరం పలికిన భూమి ధర రూ.కోటి వరకు వెళ్లింది. పదేండ్లపాటు ప్రతినెల సగటున స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లకుపైగా రాబడి వచ్చింది. పదేండ్లపాటు పెరుగుతూ వచ్చిన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయం.. హైడ్రా ద్వారా ఆక్రమణ పేరుతో భవనాల కూల్చివేతలు, వ్యవసాయ ప్రోత్సాహకాలకు కోత విధించడంతో భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రభావం పడింది. స్థిరాస్తి వ్యాపారం ఒక్కసారిగా పడిపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదిన్నర నుంచి నామమాత్రంగా రాబడి వస్తున్నది.