స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను నిర్దారించ్సాలిన బాధ్యత సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ మీద ఉన్నది. కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ కాలు బయటపెట్టడం లేదు. మరోవైపు రిజర్వేషన్ల స్థిరీకరణకు ఏమాత్రం సంబంధం లేని బీసీ కమిషన్ జిల్లాలు తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేపడుతున్నది. తానే నివేదిక ఇస్తానంటూ ప్రకటనలు చేస్తున్నది. ఇంకోవైపు, ఏ కమిషన్‌తో సంబంధం లేకుండా, పూర్తి స్వతంత్రంగా ప్లానింగ్ విభాగం ఇంటింటి సర్వే చేపడుతున్నది. దీంతో బీసీ రిజర్వేషన్లపై గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, బీసీలకు రాజ్యాంగపరమైన, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన కే కృష్ణమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2010లో కీలకమైన తీర్పు చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు అర్టికల్ 340 ద్వారా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని, ఆ కమిషన్ మాత్రమే ఆయా వర్గాల రాజకీయ వెనకబాటుతనాన్ని గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో స్వతంత్రంగా అధ్యయనం చేసి, మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సిఫారసులు చేయాలని నిర్దేశించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దని తేల్చిచెప్పింది. ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తీర్పును దేశంలోని అన్ని రాష్ర్టాలు పాటించాల్సిందేనని మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసులో స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బూసాని వెంకటేశ్వరరావు చైర్మన్‌గా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
డెడికేటెడ్ కమిషన్ ఏం చేస్తున్నది?
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఓబీసీ వర్గాల రాజకీయ వెనకబాటుతనాన్ని శాస్త్రీయ పద్ధతిలో, ప్రభుత్వం అందించే నివేదికలపై ఆధారపడకుండా డెడికేటెడ్ కమిషనే స్వయం గా, స్వతంత్ర అధ్యయనం చేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కేవలం కార్యాలయంలోనే ఆయా కుల సంఘా లు, వ్యక్తుల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తున్నది. ఇంటింటి సర్వేలో పాలుపంచుకుంటున్న దాఖలాలు లేవు. నెలరోజుల్లోనే నివేదిక సమర్పించాలంటూ 4న డెడికేటెడ్ కమిషన్‌ను ఏ ర్పాటు చేసిన ప్రభుత్వం, నెల గడువు సమీపించినా ఇప్పటివరకు ఆ కమిషన్‌కు ఉద్యోగులను, నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.
బీసీ కమిషన్ పరిధి ఏమిటి?
జాతీయస్థాయిలో 1993లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ చట్టం చేశారు. దానిని దేశవ్యాప్తంగా యథాతథంగా అమలు చేసేందుకు చట్టాలు రూపొందించుకున్నాయి. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర బీసీ కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఓబీసీ వర్గాల రాజకీయ, ఆర్థి క స్థితిగతులపై అధ్యయనం చేయడం, మం డల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలుచేస్తున్న 27% రిజర్వేషన్లను పర్యవేక్షించడం, సమీక్షించడం, బీసీ కులాల జాబితాల్లో, గ్రూపుల్లో ఒక కులా న్ని చేర్చడం, లేదంటే తొలగించడానికి సం బంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు సిఫారసులు చేయడం బీసీ కమిషన్లు నిర్వర్తించాల్సిన విధులు. అంతేతప్ప రాజకీయ రిజర్వేషన్లపై అధ్యయంపై సిఫారసులు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్లకు అధికారాలు లేవు. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
రాష్ట్ర బీసీ కమిషన్ ఏం చేస్తున్నది?
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తన పరిధి లో లేని, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వమే హడావుడిగా డెడికేటెడ్ కమిషన్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను రాష్ట్ర బీసీ కమిషన్‌కు నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో 47 విడుదల చేసింది. బీసీ కమిషన్ సైతం తన పరిధిని గుర్తించకుండానే, తాను సమర్పించే నివేదిక చెల్లుబాటు కాదని తెలిసీ రంగంలోకి దిగింది. డెడికేటెడ్ కమిషన్ నిర్వర్తించాల్సిన విధులను చేపట్టింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఆసక్తి గల వ్యక్తులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం బహిరంగ విచారణలు చేపట్టింది. ఆదిలాబాద్, నిజామాబాద్, సం గారెడ్డి, కరీంనగర్‌తోపాటు పలు జిల్లాల్లో విచారణలు పూర్తిచేసింది. దీనిపై పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. అయినప్పటికీ కమిషన్ మాత్రం యథాప్రకారం తన బహిరంగ విచారణలను మంగళవారం వరకూ నిర్వహించిం ది. త్వరలోనే హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామంటూ కమిషన్ చైర్మన్ నిరంజన్ పత్రికాముఖంగా వెల్లడించడం గమనార్హం. రిజర్వేషన్లపై బీసీ కమిషన్లు ఇచ్చే నివేదికలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ అదే తరహా స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
స్వతంత్రంగా ప్లానింగ్ విభాగం
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ప్రస్తుతం నిర్ధారించాలి. ఆ బాధ్యత డెడికేటెడ్ కమిషన్‌ది. అధ్యయనం చేయడం, సిఫారసులు చేయడం వంటి బాధ్యతలు ఆ కమిషనే నిర్వర్తించాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేకు నోడల్ డిపార్ట్మెంట్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నియమించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇటు బీసీ కమిషన్, అటు డెడికేటెడ్ కమిషన్‌తో ఏవిధమైన సంబంధం లేకుండా, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలు స్వీకరించకుండా స్వతంత్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా, మొత్తం రాష్ట్ర జనాభా ఆర్థిక, సామాజిక స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వ అజమాయిషీలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది.
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న రేవంత్
బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి బీసీ రిజర్వేషన్లపై మూడు నెలల్లోనే నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు సెప్టెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 9లోగా నివేదిక సమర్పించాల్సి ఉన్నది. అయినా అందుకు విరుద్ధంగా బీసీ కమిషన్‌కు రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఆ తరువాత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చి, అక్షింతలు వేసేంత వరకూ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. నెలరోజుల్లోనే నివేదిక సమర్పించాలంటూ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం కనీసం విధులు నిర్వర్తించేందుకు అవసరమైన ఉద్యోగులను ఇప్పటివరకు ఇవ్వలేదు. డెడికేటెడ్ కమిషన్ కోరినా, లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. ఇంటింటి సర్వే ప్రక్రియను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శలున్నాయి. ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం మొత్తంగా బీసీ రిజర్వేషన్లకే కాలం చెల్లిపోయే ప్రమాదం ఏర్పడిందని న్యాయకోవిదులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 42% ఏమో కానీ ఉన్న రిజర్వేషన్లే ఊడిపోయేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.