Telangana | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ, అసమర్థ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతున్నది. తెలంగాణ ఏర్పడినది మొదలు ఏటేటా మెరుగైన ఆదాయం సాధించి కళకళలాడిన ఖజానా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక కళతప్పడం మొదలైంది. ఒకప్పుడు కరోనా విపత్తుతో రాష్ట్ర ఆదాయ వృద్ధి పడిపోగా.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో మరోసారి కష్టకాలం దాపురించింది. ఈ విషయాలు ఎవరో చెప్పడం కాదు.. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కాగ్‌కు సమర్పించిన వివరాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం శుక్రవారం కాగ్‌కు సమర్పించింది. దీనిప్రకారం ‘కొవిడ్’ కాలాన్ని మినహాయిస్తే ఆదాయ వృద్ధిలో తొలిసారి తిరోగమనం నమోదైంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రకారం.. అన్ని రకాల ఆదాయ మార్గాల్లో కలిపి రూ.2,21,242.23 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ.. రూ.1,67,804.32 కోట్లు మాత్రమే వచ్చింది. అంచనా వేసిన దాంట్లో వచ్చింది 75.85% మాత్రమే. అంతకుముం దు సంవత్సరంలో 78.08% రాగా.. నిరుడు దాదాపు రెండున్నర శాతం తగ్గింది. సాధారణంగా ఏటికేడు రాబడి పెరగాల్సిందిపోయి 2023-24తో పోల్చితే నిరుడు రూ.1285 కోట్లు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023-24లో రెవెన్యూ రాబడులు రూ.1,69,089 కోట్లు రాగా.. 2024-25లో రూ.1,67,804 కోట్లకు తగ్గింది.
ఖజానాకు వచ్చే రాబడిలో ‘పన్ను ఆదా యం’ ప్రధానమైనది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, జీఎస్టీ.. ఇలా పన్నుల రూపంలో రాష్ర్టానికి ఆదాయం వస్తుంది. ఈ పన్నుల రాబడి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు చెప్తుంటారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.1,64,397.64కోట్ల మేర ట్యాక్స్ రెవె న్యూ వస్తుందని అంచనా వేయగా రూ. 1,36,283.47కోట్లు మాత్రమే వచ్చింది. లక్ష్యంలో ఇది 82.90 శాతం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి విశ్లేషిస్తే ఇదే అతితక్కువ. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభించిన 20 21-22 ఆర్థిక సంవత్సరంలోనూ అంచనాలకు మించి ఆదాయం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈసారి 83 శాతానికే పరిమితం కావడం గమనార్హం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవ డం మొదలైంది. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు 2023 డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినప్పటి నుంచే కష్టకాలం మొదలైందని మార్కెట్ నిపుణులు మొత్తుకుంటున్నారు. ఆ తర్వాత హైడ్రాను తెరమీదికి తెచ్చి ఇష్టారాజ్యంగా కూల్చివేతలు చేపట్టడం, మూసీ పునర్జీవ ప్రాజెక్టు పేరుతో నది పరీవాహక ప్రాం తంలోని భవనాలను కూల్చేస్తారని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. ఫోర్త్ సిటీ పేరుతో హడావుడి చేసినా, చివరికి ఫార్మాసిటీ కొనసాగుతుందని చెప్పడంతో అక్కడా తుస్సుమన్నది. కీలకమైన వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగా ల్లో మందగమనంతో రియల్ ఎస్టేట్ వ్యాపా రం పూర్తిగా దెబ్బతిన్నది. ఇందుకు ప్రభుత్వం చెప్పిన గణాంకాలే నిదర్శనం. ఈ ఏడాది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.18,228 కోట్ల ఆదాయం అంచనా వేయగా, రూ. 8,473 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే.. కేవలం 46.48 శాతం మాత్రమే.
2024-25లో జీఎస్టీ ఆదాయం రూ.58, 594.91 కోట్లు వస్తుందని ప్రభుత్వం భావించగా రూ.50,343.46కోట్లే వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 85.92% మాత్రమే. గత ఏడాది 91.28%నమోదుకాగా.. ఈసారి దాదాపు ఆరు% తగ్గింది. రియల్ ఎస్టేట్ రం గం కుదేలవడం, వ్యవసాయరంగం, పారిశ్రామిక, సేవ వంటి కీలకరంగాలన్నీ కుదేలు కావడంతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడిందని, ఫలితంగా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయని విశ్లేషకులు చెప్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి జీఎస్టీ వసూళ్లను లెక్కించడం ప్రారంభించగా.. 2022-23 వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏటికేడు వృద్ధిని నమోదు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు పతనం అవుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.
అంచనా: రూ.2,21,242 కోట్లు
వచ్చింది: రూ.1,67,804 కోట్లు
తగ్గుదల: -53,438 కోట్లు
అంచనా: రూ.1,64,397 కోట్లు
వచ్చింది: రూ.1,36,283 కోట్లు
తగ్గుదల: -28,114 కోట్లు
అంచనా: రూ.18,228 కోట్లు
వచ్చింది: రూ.8473 కోట్లు
తగ్గుదల: -9,755 కోట్లు