హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉండగా.. ప్రతిరోజూ కళా పండుగే’ అనే నినాదంతో జానపద కళాకారుల మహార్యాలీని వినోద్‌కుమార్ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా జానపద కళలు కనుమరుగు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కొమురవెల్లి వంటి ప్రధాన ఆలయాల్లో సాయంత్రం భక్తుల కోసం కళారూపాలను ప్రదర్శించేందుకు జానపద కళాకారులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. కళాకారులను ఆదుకొనేందుకు సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా సీఎం కేసీఆర్ ఉపాధి కల్పించారని వివరించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, ర్యాలీ నిర్వాహకులు బత్తిని కీర్తిలతాగౌడ్, గిరి, శరత్చంద్ర, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.