హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే డిక్లేర్ చేసి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని, ఇందులో కొత్త దనం ఏమీ లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి రాష్ట్రం పట్ల, రైతుల పట్ల ఉన్న వైఖరి ఏమిటో వరంగల్ సభ ద్వారా తేటతెల్లం అయిందన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంశలు కురిపించిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ అనుసరించారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సహా దేశవ్యాప్త పార్టీల నాయకులు కేసీఆర్ వ్యవసాయ విధాన మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలనే రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించారని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిందని గుర్తు చేశారు. రైతుల పాలిట ప్రాణ సంకటంగా మారిన నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విక్రయదారుల ఆట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను ఇప్పటికీ అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ తన డిక్లరేషన్లో చెప్పిందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వినోద్ కుమార్ తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, కానీ కాంగ్రెస్ డిక్లరేషన్లో కొత్తదనం ఏమీ లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డులన్నింటిని, భూముల వివరాలన్నీ పక్కాగా పొందుపరుస్తున్నామని తెలిపారు. కానీ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ద్వారా మళ్లీ పట్వారి వ్యవస్థను తీసుకువచ్చేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టమవుతోందని వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు సహా అనేక పరిశ్రమలు మూత పడటానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రధాన కారణమని వినోద్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామని అంటున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకు వెళ్లి ప్రతి కొనుగోలు చేసిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. రైతులను, ప్రజలను మోసం చేసే మాటలు కట్టిపెట్టాలని వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సూచించారు.