కొడంగల్, అక్టోబర్ 27: ఓటమి భయంతో కొడంగల్‌లో కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని, బీఆర్ఎస్ సర్పంచులకు డబ్బులు ఎరవేసి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొంరాస్‌పేట మండలంలో గిరిజన సర్పంచులను కొనుగోలు చేసేందుకు యత్నించి కాంగ్రెస్ నేతలు అడ్డంగా దొరికిపోయినట్టు ఆయన తెలిపారు. ఒక్కో సర్పంచ్‌కు రూ.15 లక్షలు ఇస్తామనే ఆశ చూపించి, కాంగ్రెస్ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడితే.. కాంగ్రెస్ మోసాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీకి కట్టుబడి ఉంటారని, ఎవరూ ప్రలోభాలకు లొంగరనే విషయాన్ని గిరిజన సర్పంచులు నిరూపించినట్టు ఆయన పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టిన గిరిజన బీఆర్ఎస్ సర్పంచ్‌లు నర్సింహానాయక్, శంకర్‌నాయక్, రవినాయక్‌ను మంత్రి అభినందించారు. కొనుగోళ్ల వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.