హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రాకను దేశం స్వాగతిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన నాసిర్ ఖాన్, సమీర్ షేక్, అజర్ షేక్, రశీక్ ఖాన్ తదితరులు సోమవారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని, తెలంగాణ మాడల్ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఇంతటి ప్రగతి దేశంలో మరెకడా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీఆర్ఎస్ జెండా ఎగురగడం ఖాయమని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా తగినవాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, డబుల్ బెడ్రూం ఇండ్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, సీఎం ఓవర్సీస్ సాలర్షిప్, షా దీ ముబారక్, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల గురించి నాగపూర్ వాసులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆరిఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.