హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచనాకు, అనుమతులు జారీ అయ్యేనాటికి నిర్ణయించే వ్యయానికి పొంతన కుదరడంలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, అధికారుల ఉదాసీనత వల్ల ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆది నుంచే తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరుగాంచినప్పటికీ కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ చేయూత లభించలేదు. రాష్ట్రంలోని రహదారులు సైతం ఇందుకు అతీతంకాదు. తెలంగాణలోని అనేక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.
దాదాపు 16 రాష్ట్ర రహదారులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసిన ప్రాజెక్టులకు సైతం తుది అనుమతులు జారీ చేయడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. మహబూబ్నగర్-గుడెబల్లూర్ మధ్య దాదాపు 80 కి.మీ. పొడవైన 4 లేన్ల రహదారికి మూడేండ్ల క్రితం రూ.1,500 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిరుడు అక్టోబర్లో డీపీఆర్లు సమర్పించేనాటికి ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,278.38 కోట్లకు చేరింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపేనాటికి అది రూ.3,175.08 కోట్లకు పెరిగింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 161.5 కి.మీ. పొడవున 6 లేన్లతో నిర్మించ తలపెట్టిన రహదారి ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.20,700 కోట్లకు పెరిగింది. 2024 నవంబర్లో తొలిసారి టెండర్లు పిలిచినప్పుడు ఈ రహదారిని 4 లేన్లుగా 5 ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. అందుకు రూ.7,560 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తర్వాత సంబంధిత డీపీఆర్లు సమర్పించి, టెండర్లు పిలిచే నాటికి ఆ అంచనా వ్యయం రూ.15,627 కోట్లకు పెరిగింది. తాజాగా ఇప్పుడు రెండోసారి టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,700 కోట్లకు చేరింది.
రాష్ట్రంలోని ఇతర రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఆర్మూర్-జగిత్యాల మధ్య దాదాపు 63.60 కి.మీ పొడవైన రహదారి నిర్మాణానికి రూ.2,471.76 కోట్లు, జగిత్యాల-మంచిర్యాల మధ్య 68.30 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.2,730.72 కోట్లు, జగిత్యాల-కరీంనగర్ మధ్య 58.87 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.2,394.68 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేశారు. వీటికి కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ట్రిపుల్ఆర్ సహా ప్రతిపాదిత రహదారులకు ఇంకా భూసేకరణ పూర్తికాలేదు. ట్రిపుల్ఆర్కు 90% భూసేకరణ పూర్తయినట్టు అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదు. గతంలో భూసేకరణకు అంగీకరించినవారు సైతం ఇప్పుడు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మిగిలిన రహదారుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నది. రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రిజిస్ట్రేషన్ ధర ప్రకారం నష్టపరిహారం తీసుకునేందుకు రైతులు సిద్ధంగా లేరు. దీంతో భూసేకరణ పూర్తయ్యేనాటికి ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతుందని అధికారులు అంగీకరిస్తున్నారు.