Ameenpur | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని సర్వే నంబర్ 30లో వేసిన వెంచర్ అక్రమమే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో వెంచర్ వేయడంపై ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమీన్పూర్ తహసీల్దార్ శుక్రవారం వివరణ ఇచ్చారు. సర్వే నంబర్ 30లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు గుర్తించి సెప్టెంబర్ 21న మండల గిర్దావర్ ఆధ్వర్యంలో కూల్చేసినట్టు తెలిపారు.
ఆ తర్వాత సైతం అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్టు స్థానికులు చెప్పడంతో నవంబర్ 19వ తేదీన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసుల సాయంతో రెవెన్యూ సిబ్బంది నవంబర్ 22న మూడు ఇండ్లను కూల్చేశారని, లేఔట్ కోసం చేసిన ఏర్పాట్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో సోహైల్ అనే వ్యక్తిపై నవంబర్ 23న కేసు నమోదైనట్టు వెల్లడించారు. మళ్లీ పనులు చేపట్టకుండా ఆ ప్రాంతంపై నిఘా పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి పనులు జరగడం లేదని వివరణ ఇచ్చారు.
తహసీల్దార్ ఇచ్చిన వివరణపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 21న అక్రమ నిర్మాణాలు గుర్తించి కూల్చేసిన తర్వాత.. దాదాపు రెండు నెలలపాటు మళ్లీ వెంచర్ పనులు కొనసాగాయి. జేసీబీలు, టిప్పర్లు, భారీ లారీల ద్వారా భూమి మొత్తం చదును చేసి, బండరాళ్లను తొలిగించారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. మట్టి రోడ్లు వేసి, లేఔట్ చేశారని, మూడు ఇండ్లు నిర్మించారని వివరణలో స్వయంగా తహసీల్దారే చెప్పారు. మరి ఇంత జరుగుతున్నా రెండు నెలలపాటు రెవెన్యూ సిబ్బంది ఎందుకు అటువైపు కన్నెత్తి చూడలేదన్నది పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటనలో ఒక వ్యక్తిపైనే క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అయితే.. ప్రభుత్వ భూమిని కొల్లగొట్టి, ఇంత పెద్ద వెంచర్‌ను కేవలం ఒక్క వ్యక్తి వేయడం సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు. పెద్దలను కాపాడేందుకే తూతూమంత్రంగా ఒకరిపై కేసు నమోదు చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనే రద్దయిన ఓఆర్సీ సర్టిఫికెట్లతో ఇప్పటికే కొందరికి పట్టాలు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బై నంబర్లు వేసి తలా ఐదెకరాల చొప్పున కొందరికి పాస్‌బుక్‌లు మంజూరైనట్టు తెలుస్తున్నది. వెంచర్ అక్రమమే అని చెప్తున్న రెవెన్యూ అధికారులు ఈ పట్టాలను రద్దు చేస్తారా? అనేది వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఈ పాస్బుక్ల మంజూరులో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంచర్లో వేసిన విద్యుత్ స్తంభాలు, లైన్లు, ప్రహరీ, రోడ్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు.