హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నెల 10న చర్చలకు రావాలని కార్మిక జేఏసీ నేతలను, ఆర్టీసీ యాజమాన్య అధికారులను కార్మికశాఖ ఆహ్వానించింది. కార్మిక నేతలు 21 డిమాండ్లతో జనవరి 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 9 నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కానీ ప్రభు త్వం ఫిబ్రవరి 10న చర్చలకు పిలిచింది. గడువు తర్వాతి రోజు చర్చలకు పిలవమేంటని యూనియన్ల నేతలు మండిపడుతున్నారు.
బస్‌డిపోలను ప్రైవేటీకరించం : సజ్జనార్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని, డిపోల ప్రైవేటీకరణ జరుగొచ్చని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని చెప్పారు. శుక్రవారం సంస్థ క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారులతో సజ్జనార్ వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
‘కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ సమకూర్చుకుంటున్నది. వీటితో సహా అన్ని బస్సుల నిర్వహణ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3,038 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిందని, వాటి నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని సజ్జనార్ తెలిపారు.