హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో జారీచేసిన జీవో 51ని సవరిస్తూ.. జీవో 104 ద్వారా సీబీఐకి సాధారణ అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు సెక్షన్ 6 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ దర్యాప్తునకు సిఫారసు చేసింది. ఆ నివేదికలో ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని పేరొంది. అలాగే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తీవ్రమైన లోపాలు, అవకతవకలు జరిగినట్టు నివేదికలో వెల్లడించిందని, దానిపై అసెంబ్లీలో చర్చ జరిపి.. ఆ నివేదికల ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉన్నందున, దర్యాప్తు కోసం సీబీఐని ఆశ్రయించినట్టు తెలిపింది. సీబీఐ దర్యాప్తునకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.