సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు. బీజేపీ పిటిషన్ దాఖలు చేసే నాటికి సీఎం ప్రెస్ మీట్ అనేదే జరగలేదు. సిట్ కూడా ఏర్పాటుకాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన 12 గంటల్లోపే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. బీజేపీ ఆఘమేఘాలపై రిట్ దాఖలు చేయడం గురించి జడ్జి తీర్పులో ప్రస్తావించలేదు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలి. సిట్ దర్యాప్తు యథాతథంగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలి.
తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలో నిందితులే కోరుకోవడం, అందుకు అనుగుణంగా సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి. తమపై కేసును ఫలానా సంస్థ దర్యాప్తు చేయాలని కోరే హకు నిందితులకు ఉండదు. నిర్దిష్టమైన దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరే హకు నిందితులకు లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సింగిల్ జడ్జి పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం విస్మరించి సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు ఘోర తప్పిదమే.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వేసిన నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సింగిల్ జడ్జి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో బేరసారాలు జరపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేయడం అన్యాయం. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సరికాదు.
అధికారపార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయడమే అవుతుంది. పీవీ నర్సింహారావు కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పు చెల్లదు.
– హైకోర్టు అప్పీల్ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం , సిట్
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అప్పీల్ చేశాయి. ప్రస్తుతంలాగే సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఈ కేసులో నిందితులు, బీజేపీ నేత దాఖలు చేసిన రిట్ పిటిషన్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాదిగానూ, ప్రతివాదిగానూ లేనప్పుడు.. సింగిల్ జడ్జి వెలువరించిన సీఎం గురించి తీర్పులో ప్రస్తావించడాన్ని తప్పుపట్టాయి. కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదని, సిట్ దర్యాప్తునకు అనుమతివ్వాలని కోరాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని ఆరోపించాయి. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వెలువడిన సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరాయి. అప్పీల్ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనున్నది.
సీఎం కొత్తగా చెప్పిందేమీ లేదు
సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కొత్తగా ఏమీ చెప్పలేదని, కేసు ఫిర్యాదుదారు, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చెప్పిన విషయాలనే ఆయన మీడియాకు చెప్పారని అప్పీల్ పిటిషన్లో రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అప్పటికే ప్రజలకు తెలిసిన విషయాల గురించే చెప్పారని, దీనిని ఆధారంగా చేసుకొని సిట్ పారదర్శకంగా లేదని జడ్జి తేల్చడం సరికాదని వాదించింది. ‘455/2022 ఎఫ్ఐఆర్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అన్యాయం. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడంలో తప్పులేదని చెప్పిన ధర్మాసనం, సదరు కేసు మెటీరియల్ సీఎంకు ఎలా చేరిందనే అంశంపై సందేహాలను వ్యక్తం చేయడం సముచితంగా లేదు. సిట్ చట్ట ప్రకారమే ఏర్పాటైంది. బీజేపీ, నిందితులకు 3వ పేజీలో
వ్యతిరేకంగా సిట్ పనిచేయడం లేదు. సిట్ దర్యాప్తునకు అనుమతివ్వాలి. సిట్ సీఎంకు సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం తర్వాతే సిట్ ఏర్పాటైందనే విషయాన్ని జడ్జి విస్మరించారు. బీజేపీ పిటిషన్ దాఖలు చేసే నాటికి సీఎం ప్రెస్‌మీట్ జరగనేలేదు. సిట్ కూడా ఏర్పాటు కాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన 12 గంటల్లోపే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు’ అని పిటిషన్లో పేర్కొన్నది.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రే
ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వేసిన నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ప్రశంసించిన ఏక సభ్య ధర్మాసనం, సిట్ దర్యాప్తును రద్దుచేయటం అన్యాయమని అప్పీల్ పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం, సిట్ ఆక్షేపించాయి. ‘ఈ కేసు విషయంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పోలీసుల చర్యలు స్వాగతించదగినవని సింగిల్ జడ్జి ధర్మాసనం కొనియాడింది. తెలంగాణ ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులతో బేరసారాలు జరపడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అయినా సిట్ దర్యాప్తును రద్దు చేయడం అన్యాయం. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సరికాదు. మోహిందర్‌సింగ్ గిల్ వర్సెస్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కేసులో సుప్రీంకోర్టు 1978లో ఇచ్చిన తీర్పు ప్రకారం సింగిల్ జడ్జి తీర్పు చెల్లదు. చట్టసభ సభ్యుల కొనుగోలుకు చేసిన ప్రయత్నాలపై పోలీసులు నమోదు చేసిన కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలి. అధికారపార్టీ చట్టసభ సభ్యుల కొనుగోలుకు ప్రయత్నించడం ప్రభుత్వాన్ని కూల్చే కుట్రే అవుతుంది. పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పు చెల్లదు’ అని వాదించాయి.
12 గంటల్లోనే బీజేపీ పిటిషన్
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులు ఫిర్యాదుదారులతో మంతనాలు జరిపారని అప్పీల్ పిటిషన్లో ప్రభుత్వం గుర్తుచేసింది. బీజేపీలో చేరితే కోట్ల రూపాయలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఇస్తామని ఎర వేయడం తీవ్ర నేరమేనని సింగిల్ జడ్జి చెప్తూనే సిట్ దర్యాపు నిలుపుదల చేయడం చట్ట వ్యతిరేకమని వాదించింది. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది. ఎమ్మెల్యేలకు లంచం ఇస్తామని ఎర వేసినట్టు వీడియో రికార్డింగులు ఉన్నాయి. ఆడియో రికార్డింగ్ ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సింగిల్ జడ్జి సిట్ దర్యాప్తు సరికాదని చెప్పడానికి ‘థర్డ్ టేప్’అని పిలిచేవాటిపై ఆధారపడాలి. థర్డ్ టేప్ అనేది ఊహాజనితమే అవుతుంది.
రిట్ పిటిషన్ పరిధిలో లేని అంశంలోకి సింగిల్ జడ్జి వెళ్లారు. లలితకుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎమ్మెల్యేల ఎర కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ 2022 అక్టోబర్ 27న నమోదైతే, బీజేపీ కేవలం 12 గంటల వ్యవధిలోనే హైకోర్టులో దానిని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారు. బీజేపీ ఆగమేఘాలపై రిట్ దాఖలు చేయడం గురించి జడ్జి తన తీర్పులో ప్రస్తావించలేదు. నిందితుల పిటిషన్‌ను సింగిల్ జడ్జి ఆమోదించకుండా కొట్టేసి ఉండాల్సింది. సిట్ దర్యాప్తును అడ్డుకోడానికి తగిన కారణాలు ఏమీ లేకపోయినా సిట్‌ను రద్దుచేసి కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం సరికాదు’ అని వాదించింది.
ఎమ్మెల్యేలకు లంచం ఇస్తామని ఎర వేసే ప్రయత్నం చేసినప్పుడు అకడ వీడియో రికార్డింగ్ ఆధారాలున్నాయి. ఆడియో రికార్డింగ్ ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సింగిల్ జడ్జి సిట్ దర్యాప్తు సరికాదని చెప్పడానికి ‘థర్డ్టేప్ ’ అని పిలిచే వాటిపై ఆధారపడాలని అన్నారు. మూడో టేప్ అనేది ఊహాజనితమే అవుతుంది. రిట్ పిటిషన్ పరిధిలో లేని అంశంలోకి సింగిల్ జడ్జి వెళ్లారు.
సిట్‌ను సుప్రీంకోర్టు కూడా అడ్డుకోలేదు
ఒక రాజకీయ నేతగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని తెలిసినప్పుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు వెల్లడించటం తప్పు ఎలా అవుతుందని సింగిల్ జడ్జి ఒప్పుకొన్నారని అప్పీల్ పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది. ‘సీఎంకు కేసు దర్యాప్తు సమాచారం ఎలా చేరిందనే అనుమానం నివృత్తి కాకపోవడంపై సందేహం వ్యక్తంచేస్తూ సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండదని తీర్పు చెప్పడం చట్ట వ్యతిరేకం. నిందితులను పోలీసులు ట్రాప్ చేసి కీలక సాక్ష్యాధారాలను సేకరించిన ప్రధాన విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారు. సిట్‌లోని అధికారులపై ఏవిధమైన ఆరోపణలు లేని అంశాన్ని సింగిల్ జడ్జి గుర్తించి కొనియాడలేకపోయారు. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన 12 గంటల్లోపే బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేస్తే, ఆ తర్వాత అదే తరహాలో నిందితులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సానుకూల ఉత్తర్వులు వెలువడలేదు. సిట్ దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణ చేయాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో సిట్ వద్దని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని నిందితులు కోరితే అందుకు అనుగుణంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సిట్ స్వతంత్రంగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది’ అని గుర్తుచేసింది.
నిందితులే దర్యాప్తు సంస్థను ఎంచుకోరాదు
తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలో నిందితులే కోరుకోవడం, అందుకు అనుగుణంగా సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వడం చట్ట వ్యతిరేకమని సిట్, రాష్ట్రప్రభుత్వం వాదించాయి. ‘తమపై కేసును ఫలానా సంస్థ దర్యాప్తు చేయాలని కోరే హకు నిందితులకు ఉండదు. నిర్దిష్ట దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరే హకు నిందితుకు లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సింగిల్ జడ్జి పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం విస్మరించి సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు ఘోర తప్పిదమే. ఎఫ్ఐఆర్ నేరారోపణల సమాచారాన్ని తెలుపుతుంది. కేసు దర్యాప్తు మాత్రం చట్టానికి లోబడి ఉంటుంది. నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీబీఐ దర్యాప్తునకు సింగిల్ జడ్జి ఆదేశించే ఆసారమే లేదు’ అని పేర్కొన్నది.
సీఎం విలేకరుల సమావేశం నిర్వహించిన అంశాన్ని సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించడం సరికాదు. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లో సీఎంను ప్రతివాదిగా చేయలేదన్న అంశాన్ని జడ్జి పూర్తిగా విస్మరించారు. ఈ విషయాన్ని తీర్పులో ప్రస్తావించడంలో విఫలమయ్యారు. ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని విధిగా ప్రతివాదిని చేయాలన్న ప్రాథమిక చట్ట నిబంధనల గురించి చట్టాలు ఘోషిస్తున్నాయి. ఇకడ సీఎంను ప్రతివాదిగా చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎంపై ఆరోపణలకు చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత లేని అంశాన్ని ఆధారంగా చేసుకొని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదు.
నిందితులకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సానుకూల ఉత్తర్వులు వెలువడలేదు. సిట్ దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సైతం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో సిట్ వద్దని, సీబీఐకి బదిలీ చేయాలని నిందితులు కోరితే అందుకు అనుగుణంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సిట్ స్వతంత్రంగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.
సీఎం ప్రతివాది కాదు కదా!
సీఎం విలేకరుల సమావేశం నిర్వహించిన అంశాన్ని సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తావించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పిటిషన్లో అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘సీఎం మీడియా సమావేశాన్నే తీర్పులో ఎకువగా ప్రస్తావించారు. నిందితుల పిటిషన్లో సీఎం ప్రతివాదిగా లేరన్న విషయాన్ని జడ్జి పూర్తిగా విస్మరించారు. ఈ విషయాన్ని తీర్పులో నమోదు చేయడంలో విఫలమయ్యారు. సీఎం విలేకరుల సమావేశం నిర్వహించడం పూర్తిగా రాజకీయ అంశం. ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని విధిగా ప్రతివాది చేయాలన్న ప్రాథమిక నిబంధనల గురించి చట్టాలు ఘోషిస్తున్నాయి. ఇకడ సీఎంను ప్రతివాదిగా చేయలేదు. అలాంటప్పుడు సీఎంపై ఆరోపణలకు చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత లేని అంశాన్ని ఆధారంగా చేసుకొని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదు. సీఎం విలేకరుల సమావేశంలోకి ఎమ్మెల్యేల ఎర కేసు మెటీరియల్ ఎలా చేరిందనే మీమాంస వీడలేదని తీర్పులో పేరొన్నారు. నిందితులు వేసిన కేసులో సీఎం కేసీఆర్ ప్రతివాదిగా లేనప్పుడు ఆ విధమైన ముగింపునకు సింగిల్ జడ్జి రావడం చట్ట వ్యతిరేకం అవుతుంది. పిటిషన్లో లేని అంశాల జోలికే ఎకువగా వెళ్లి నిందితులకు ఉపశమనం కల్పించారు’ అని ప్రభుత్వం ఆక్షేపించింది.
సుప్రీంకోర్టు చెప్పినా
అవినీతికి సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు వీలుగా రామ్‌కిషన్ వర్సెస్ ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేల ఎర కేసుపై సత్వర దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం తన పిటిషన్లో వాదించింది. ‘దర్యాప్తు తర్వాత దాఖలయ్యే చార్జిషీట్‌పై కోర్టులు విచారణ పూర్తి చేసి తీర్పులు చెప్తాయి. కాబట్టి సిట్ ఏర్పాటు చట్టబద్ధమే. నిందితులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చార్జిషీట్ దాఖలైన తర్వాతే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ తొలి దశలోనే నిందితుల అభ్యర్థనను జడ్జి ఆమోదించడం ద్వారా కేసులోని వాస్తవాలను పూర్తిగా పకకు పెట్టేశారు. సిట్ శాస్త్రీయ దర్యాప్తును పకకు పెట్టి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం సమర్థనీయం కాదు. ఎమ్మెల్యేల ఎర కేసును తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా సదరు కేసులో జరిగిన బాగోతాన్ని గురించి చెప్పిన తీర్పు ప్రతిని అందజేసినా సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు’ అని ఆక్షేపించింది.
బీజేపీ నేతతోపాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లలో సీఎంకు సీడీల రూపంలో దర్యాప్తునకు చెందిన వీడియోలను పోలీసులు ఇచ్చారనే ఆరోపణలకు ఎవ్వరూ ఆధారాలు చూపలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగానే సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పబ్లిక్ డొమైన్లోని వీడియోల గురించే సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫిర్యాదుదారు చెప్పిన విషయాలనే సీఎం మీడియాకు చెప్పారు.
అసాధారణ పరిస్థితులు లేకపోయినా
తీవ్రస్థాయి నేరాభియోగాలు ఎదురొనే నిందితులు తమపై కేసును ఎవరు దర్యాప్తు చేయాలో చెప్పటానికి వీల్లేదని, ఏ వ్యక్తీ తన సొంత తప్పుపై ఫలానా సంస్థ దర్యాప్తు చేయాలని కోరరాదని ప్రభుత్వం వాదించింది. ‘సింగిల్ జడ్జి తీర్పు ప్రకారం నిందితులు కోరిన మేరకు దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది నిందితులకు ప్రత్యేక హకుల కల్పన కిందకే వస్తుంది. 2020లో జరిగిన అర్నాబ్ రంజన్ గోస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సీబీఐకి బదిలీ ఉత్తర్వుల జారీ అసాధారణమని సుప్రీంకోర్టు తేల్చింది.
ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పూర్తిగా విస్మరించారు. అసాధారణ (రేర్ ఆఫ్ రేర్ ) పరిస్థితుల్లోనే సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇకడి కేసుకు వర్తించకపోయినా కేసును సీబీఐకి బదిలీ చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై లేనిపోని సందేహాలు వ్యక్తంచేసే హకు నిందితులకు లేదు. వాళ్లకు ప్రాథమిక హకులు కూడా లేవు. రాజ్యాంగంలోని 226 అధికరణాన్ని అసాధారణంగానే వినియోగించాలి. అయితే నిందితులకు సింగిల్ జడ్జి అసాధారణ ఉపశమనాన్ని ఇచ్చారు’ అని తెలిపారు.
ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న నేతలు
నిష్పక్షపాతంగా చేసిన దర్యాప్తు పురోగతిని ఏక సభ్య ధర్మాసనానికి సిట్ అందజేసిందని ప్రభుత్వం తెలిపింది. ‘కేసును సీబీఐ లేదా హైకోర్టు నియమించే సిట్‌కు బదిలీ చేయాలని మాత్రమే నిందితులు కోరారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును రద్దు చేయాలని కోరలేదు. సిట్ దర్యాప్తును అన్ని దశల్లోనూ అడుగడుగునా అడ్డుకొనేందుకు నిందితులు ప్రయత్నించిన విషయాన్ని జడ్జి గమనింపులోకి తీసుకోలేదు. సిట్‌పై ఆరోపణలు లేనప్పుడు దానిని పకన పెట్టడం అర్థంలేని చర్య. వీడియోలను సీఎంకు రాజేంద్రనగర్ ఏసీపీ ఇచ్చారన్న ఆరోపణలపై ఆధారాలను నిందితులు ఎవ్వరూ చూపలేదు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం పతనం అవుతుందని ప్రకటించిన రాజకీయ నేతలు ఇకడ పిటిషన్ వేసి ఉపశమనం పొందారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల గురించి దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సీఎం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడాలి. సీఎంకు వీడియోల సీడీలు ఎలా చేరాయనేది ఇదమిద్ధంగా తేలలేదని, మిస్టరీగా ఉన్నదని తీర్పులో చెప్పడం అసంబద్ధం’ అని వాదించింది.
నిందితులు ఆరోపణలకు ఆధారాలు చూపలేదు
దర్యాప్తు చేసే పోలీసులపై నిందితులు లేవనెత్తిన అనుమానాలు అర్ధరహితమని ప్రభుత్వం తన పిటిషన్లో వాదించింది. తొలుత సిట్ దర్యాప్తుపై స్టే విధించిన సింగిల్ జడ్జి, తర్వాత దర్యాప్తునకు అనుమతించారు. తుది తీర్పులో సిట్‌ను రద్దు చేసేశారు. తీవ్ర నేరాభియోగాల కేసుల్లో నేరానికి చెందిన వాస్తవ విషయాలను మీడియా ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేయడం వింతేమీ కాదు. కొత్త కూడా కాదు. గతంలో అనేక కేసుల గురించి మీడియాలో విస్తృతంగా వార్తలు, కథనాలు వచ్చాయి. వాస్తవ వార్తల గురించి తెలుసుకొనే హకు ప్రజలకు కూడా ఉన్నది. సిట్‌పై నిందితుల ఆరోపణలకు ఆధారాలు ఒకటి కూడా చూపలేదు.
పబ్లిక్ డొమైన్లో, యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను పరిగణనలోకి తీసుకోరాదు. పబ్లిక్ డొమైన్లోని వీడియోల వల్ల దర్యాప్తునకు ఏవిధంగా నష్టం జరుగుతుందో కూడా నిందితులు చెప్పలేకపోయారు. కొన్ని వీడియోలు లీక్ అవ్వడం వల్ల దర్యాప్తు పక్షపాతంగా ఉంటుందని నిర్ధారణకు జడ్జి రావడం సబబు కాదు. నిందితులు ఫాంహౌస్‌లో ప్రత్యక్షంగా పట్టుబడ్డ విషయాన్ని విస్మరించారు. వీటిని బేరీజు వేస్తే నిందితుల హకులకు ఏవిధంగా భంగం ఏర్పడిందో జడ్జి స్పష్టం చేయలేదు. ఇలాంటి ప్రాథమిక అంశాలను సింగిల్ జడ్జి విస్మరించారు’ అని ఆక్షేపించింది.
పోలీసుల ఆత్మసె్థైర్యం దెబ్బతింటుంది
దర్యాప్తు సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాల్సిన ప్రత్యేక అవసరం ఏమీ కనబడటం లేదని ప్రభుత్వం వాదించింది.‘ సీఎం మీడియా సమావేశంలో వ్యవస్థీకృత నేరానికి పాల్పడిన నిందితులను కుట్రదారులుగా ముద్రించారంటూ జడ్జి అపోహలతో, ఊహాగానాలతో నిర్ణయానికి వచ్చారు. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని నిందితులు చెప్పలేకపోతున్నారనే నిర్ణయానికి రావడం కూడా సరికాదు. కేసు నమోదు దశ నుంచి తీర్పు వెలువడే వరకు నిందితులకు అన్ని స్థాయిల్లోనూ చట్టబద్ధమైన భద్రత ఉంటుంది. తప్పు చేయనప్పుడు నిందితులు సిట్ దర్యాప్తునకు భయపడకూడదు.
మొయినాబాద్ ఫాంహౌస్‌లో నిందితులను వలవేసి ప్రత్యక్షంగా పట్టుకోవడాన్ని జడ్జి కచ్చితంగా అభినందించి తీరాలి. సిట్ వద్దని ఉత్తర్వులు ఇవ్వడం రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారని నిందితులపై ఆరోపణ. ఇలాంటి కేసులో సమాచారం గోప్యంగా ఉండాలని ఆశించకూడదు. ఏ కోణంలో చూసినా సిట్‌ను రద్దు చేసి సీబీఐ దర్యాప్తునకు ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకమే. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. సిట్ దర్యాప్తును కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం, సిట్ హైకోర్టును కోరాయి.