హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం 2025-26 సంవత్సరం కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 30 వరకు టెండర్లు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి… రాష్ట్ర మత్స్యసహకార సంఘం చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఏడాది ఆరున్నర లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్లతో అత్యాధునిక ఎగుమతి ప్రధాన చేపల హోల్‌సేల్ మార్కెట్ నిర్మిస్తామని తెలిపారు. నిరుడు చేప పిల్లల పంపిణీలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ విచారణ నడుస్తున్నదని చెప్పారు. కానీ రెండేండ్లకు సంబంధించి.. చేపపిల్లల సరఫరా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.143 కోట్ల బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంపై కాంట్రాక్టర్లు, మత్య్యకారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బకాయిలపై స్పష్టత ఇచ్చిన తర్వాతే కొత్త షెడ్యూల్‌పై ముందుకు వెళ్లాలని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పథకం కాంగ్రెస్ పాలనలో నీరుగారుతున్నది. ఏటా ఈ పథకానికి ఖర్చుచేసే నిధులతోపాటు పంపిణీ చేసే చేప పిల్లల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నదని మత్స్యకారులు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో నిరుడు ఈ పక్రియ చాలా ఆలస్యమైంది. ఫలితంగా నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 50% కూడా సాధించలేకపోయింది. చేపలు ఆశించిన సైజు పెరగకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా టెండర్ల షెడ్యూల్‌ను ఆలస్యంగా ప్రకటించింది. మే నెలలో జరగాల్సిన టెండర్ల ప్రక్రియను ఆగస్టులో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మందుగానే రావడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు కళకళలాడుతున్నాయి. కానీ, చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ తీవ్రజాప్యం చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2016లో నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పథకం మత్స్యకారులకు ఎంతో భరోసా కల్పించింది. అప్పటి నుంచి ఏటా వానకాలం సీజన్లో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో చేపపిల్లలను పండుగ వాతావరణంలో వదిలేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చేప పిల్లలను వదలడంతో అవి ఆశించిన స్థాయిలో పెరగక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో 29,434 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 కోట్ల చేపపిల్లలు, రొయ్య పిల్లలను వదలాల్సి ఉన్నది. కానీ రెండేండ్లుగా చేపపిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు మత్స్యశాఖ దాదాపు రూ.143 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాల్సి ఉన్నది. కానీ బకాయిలు చెల్లించనందున ఈ సారి టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదని తెలుస్తున్నది.