Vanamahotsavam | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. కేసీఆర్ హయాంలో ప్రతి ఏడాది సగటున 30 కోట్ల వరకు మొక్కలు నాటితే.. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది 20 కోట్ల మొక్కలను లక్ష్యంగా పెట్టుకున్నది.
లక్ష్యంలో 90 శాతం మాత్రమే మొక్కలు నాటిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 18 కోట్ల మొక్కలను మాత్రమే నాటుతామని ప్రకటించింది. జూన్లో మొదటి వారంలో ప్రారంభం కానున్న ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో 18 కోట్ల మొక్కలను నాటే ప్రయత్నం చేస్తున్నామని, వచ్చే ఏడాది లక్ష్యాన్ని 16 కోట్ల మొక్కలకు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని అటవీశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు.