హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5,6,7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడే లాబీయింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గవర్నర్‌కు పంపిన అర్డినెన్స్ ముసాయిదాపై చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు బీసీ బిల్లులు కేంద్రం వద్ద, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెడింగ్‌లో ఉన్న విషయాన్ని మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం.
సాధ్యం కాదన్న నిపుణుల కమిటీ
కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, 50% పరిమితిని తొలగించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచించినట్టు సమాచారం. ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ర్టాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్టు సమాచారం. నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యక్రమంపై మంత్రులు తర్జనభర్జనపడ్డట్టు సమాచారం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకుంటూ.. మన చేతిలో ఉన్నంతవరకు చేశామని, కేంద్రం అడ్డుకుంటే మనమేం చేస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
దీంతో బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యతను బీజేపీ మీదకు నెట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉన్నది కాబట్టి, రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్చల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకోసం ఆగస్టు 5,6,7 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లాలని మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది. ఈ మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలవడంతోపాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాకే ఎన్నికలు
చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు సాధ్యం కానప్పుడు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి సూచన చేసినట్టు సమాచారం. సీఎం సూచనను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. బీసీలకు ఇంతకాలం ఆశపెట్టి, తీరా ఎన్నికల వేళ పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే బీసీల నుంచి వ్యతిరేక వస్తుందని వారు హెచ్చరించినట్టు సమాచారం. 42% రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకుందామని సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ఎరువుల కొరత, పునాస కరువు తదితర కారణాలతో రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారని, దీనికితోడు బీసీ రిజర్వేషన్లు లేకుండా మొండిచెయ్యితో వెళ్తే నష్టపోతామని, క్షేత్రస్థాయిలో పరాభవం తప్పదని పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించినట్టు తెలిసింది. మంత్రుల సూచనలతో ఏకీభవించిన సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్లు కొలిక్కి వచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్దామని, అప్పటివరకు ఎన్నికలను వాయిదా వేద్దామనే ఏకాభిప్రాయానికి మంత్రివర్గం వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైక్రోబ్రూవరీల పాలసీలో సవరణలు, నాలుగు ప్రాంతాల్లో గోశాలల నిర్మాణం, గిగ్ వరర్ల పాలసీ తదితర అంశాల మీద కూడా క్యాబినెట్ చర్చించినట్టు సమాచారం.
సీతారామ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 19,325 కోట్లు
సమీకృత సీతారామ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.19,325 కోట్లకు సవరించారు. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.13,057 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ఆమోదం తెలిపింది. తాజాగా ఆ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.19,325 కోట్లకు సవరించింది. సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్-3లోని ప్యాకేజీ-2 పనులను సైతం రూ.526 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు సవరించింది. అదేవిధంగా నాగార్జునసాగర్ ఎడమకాలువ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌పై ముక్తేశ్వరపురం, గనపవరం మేజర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమందారం గ్రామంలో కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు రూ.415 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సదరమాట్ బరాజ్ అంచనా వ్యయాన్ని రూ.516 కోట్ల నుంచి రూ.676 కోట్లకు సవరించారు. మోడికుంట వాగు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.522 కోట్ల నుంచి రూ.714 కోట్లకు సవరిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరు కాలేదు.
బీసీ మంత్రులను లెక్కచేయని సీపీఆర్వో
సెక్రటేరియట్ సాక్షిగా సీపీఆర్వో మల్సూర్ బీసీ మంత్రులను అవమానించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రివర్గ సమావేశం సోమవారం రాత్రి 8 గంటలకు ముగిసింది. బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఎజెండా కాబట్టి, సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించాలని బీసీ మంత్రులకు సూచించారు. దీంతో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ కలిసి మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో కూర్చున్నారు. మీడియాకు వెల్లడించాల్సిన అంశాలను వీరికి సీపీఆర్వో మల్సూర్ బ్రీఫింగ్ చేయాల్సి ఉన్నది. అయితే, సీపీఆర్వో మాత్రం ‘బీసీ మంత్రులే కదా’ అని సమావేశం ముగిసిన వెంటనే తన బాధ్యతను వేరొకరికి అప్పగించి వెళ్లిపోయినట్టు బీసీ మంత్రులు గుర్తించారు. ఆయన కోసం దాదాపు 50 నిమిషాలపాటు ఎదురుచూసిన మంత్రులు ఓపిక నశించి మీడియా సమావేశాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.