హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు నిధులను కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మంజూరు చేసిన నిధులను సైతం ఖర్చు చేయడం లేదు. డ్రిప్(డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) ఫేజ్-2, ఫేజ్-3కు రూ.100 కోట్లు మంజూరైనా వెచ్చించకపోవంతో ఆ నిధులు ఏటా ల్యాప్స్ కావడం పరిపాటిగా మారింది. డ్రిప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 736 డ్యామ్‌లను ప్రపంచ బ్యాంకు నిధులతో పునరుద్ధరించాలని లక్ష్యం పెట్టుకోగా, అందుకోసం రూ.10,211 కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి ఫేజ్-2 కింద 20, ఫేజ్-3 కింద 9 మొత్తం 29 ప్రధాన డ్యామ్‌లను పునరుద్ధరించేందుకు ఎంపిక చేసింది. వాటి ఆధునికీకరణ, మరమ్మతుల కోసం రూ.645.13 కోట్లు ఖర్చు చేసి 2031నాటికి పూర్తిచేయాల్సి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 29 ప్రాజెక్టుల్లో ఒక్కటీ చేపట్టలేదు.
మురిగిపోతున్న నిధులు
డ్రిప్ పథకం అమలు కోసం ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి 70శాతం కేంద్రం రుణంగా రాష్ట్రానికి ఇస్తే, 30శాతం రాష్ట్రం ఖర్చు చేయాలి. 29 ప్రాజెక్టులకు రూ.645.13 కోట్లు అవసరమనే అంచనా ప్రకారం రాష్ట్రం రూ.193కోట్లు సమకూర్చాలి. మిగతా రూ.452.13కోట్లలో కేంద్రం రుణం సమకూర్చే నిధుల్లో ఇప్పటికే గతేడాది రూ.100 కోట్లు మంజూరు చేసింది. రాష్ట ప్రభుత్వం సైతం ఈ ఏడాది బడ్జెట్లో వరుసగా డ్రిప్ కోసం రూ.45కోట్లను కేటాయిస్తున్నది తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో కేంద్రం నిధులు ఏటా ల్యాప్స్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో చురుగ్గా ‘డ్రిప్’
డ్రిప్ ఫేజ్-2, ఫేజ్-3 2022 నుంచి అమలులోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రిప్ అమలులో భాగంగా ఏబీ పాండ్యా చైర్మన్‌గా 8మంది సభ్యులతో, అశోక్‌కుమార్ గంజు చైర్మన్‌గా 9మంది సభ్యులతో రెండు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్స్ కమిటీలను నియమించింది. ఆ రెండు కమిటీలు నిర్దేశిత 29 డ్యామ్‌లను పరిశీలించి ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆనకట్టల రక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే గతంలోనే గడ్డెన్నవాగు, సాత్నాల, స్వర్ణ, ఎస్సారెస్పీ సహా 12 ప్రాజెక్టులపై నివేదికలు సమర్పించింది. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్ అమలు అటకెక్కింది. రిపోర్టులు తప్ప పనులకు చేయలేదు.
డ్రిప్ వదిలి ఓఅండ్ఎం ద్వారా
డ్రిప్‌ను పకడ్బందీగా అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం) విభాగం ద్వారా పనులు చేపడుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎస్సారెస్పీకి డ్రిప్ ద్వారా మంజూరైన రూ.63.48కోట్లతో కట్టను పటిష్టం చేయడంతో పాటు జంగిల్ క్లియరెన్స్, ప్రధాన కాల్వల మరమ్మతులు, ఫిజోమీటర్ల పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉంది. అయితే రివిట్మెంట్ దెబ్బతింటున్నదని అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని ప్రభుత్వం తాజాగా డ్రిప్ కాకుండా ఓఅండ్ఎం ద్వారా పనులు చేయాలని నిర్ణయించించి రూ.18కోట్లు మంజూరు చేసింది. సాత్నాల, కడెం ప్రాజెక్టులకు కూడా ఇటీవల ఓఅండ్‌ఎంలో చేర్చి పనులు చేసేందుకు సిద్ధమైంది. నిధులు లేవని చెబుతున్న సర్కారు, కేంద్రం ఇచ్చే ‘డ్రిప్’ నిధులను ఎందుకు వినియోగించడం లేదని ఇరిగేషన్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.