చిక్కడపల్లి, మార్చి 21 : ‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను కచ్చితంగా సవరించాలి. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి. వ్యవసాయం, సంక్షేమం వంటి ప్రాధాన్య రంగాలకూ భారీగా నిధులు పెంచాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తాం’ అని పలువురు వక్తలు హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రసంగించిన వక్తలు పలు అంశాలను లేవనెత్తారు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వ వ్యవస్థలో బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాల ఆదాయ వనరులను కేంద్రం లాకోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒకలా, బీజేపీయేతర పాలిత రాష్ర్టాలకు మరోలా నిధులు కేటాయించడాన్ని తప్పుబట్టారు. పేదల సంక్షేమానికి సంపన్నులపై పన్నుల భారాన్ని పెంచాల్సిందేనని నొక్కిచెప్పారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఇప్పటికీ చట్టబద్ధత లేదు.. అని ఆర్థిక విశ్లేషకుడు ప్రొఫెసర్ డీ పాపారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలోనే రూ.3.49 లక్షల కోట్ల అప్పు చేసిందని ఎత్తిచూపారు. ఈ సారి బడ్జెట్లో రూ.82 వేల కోట్ల అప్పు చేయబోతున్నట్టు పొందుపర్చారని వివరించారు. అప్పు పరిమితులు మించి విపరీతంగా చేస్తే ప్రమాదకరం అని హెచ్చరించారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు అత్యధిక అప్పులు న్న 10 రాష్ర్టాల్లో ఒకటిగా ఉన్నదని చెప్పా రు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ ఉనికి ప్రమాదంలో పడిందని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు హెచ్చరిక లాంటిందని ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. దేశంలో విద్య, వైద్యం, రవాణా రంగాలను ప్రజలకు ఉచితంగా ఇస్తే ఆటోమేటిక్‌గా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. మన దేశంలో ధనికులకు, పేదలకు ఒకేలా 30 శాతం పన్ను లు విధించడం దారుణమని పేర్కొన్నారు. పన్నుల అధికారాన్ని కేంద్రం లాక్కొన్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్య కు 12 నుంచి 13% నిధులు కేటాయించేవారని, ఇప్పుడు 8 శాతానికే పరిమితం చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలకు నిర్ధిష్ట కేటాయింపు లు ఏవీ? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్లో ఎకువగా రుణాలు, వడ్డీలు, జీతభత్యాలకే పోతే సంక్షేమం, అభివృద్ధి ఎలా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇం డ్లకు రూ.5 వేల కోట్లు ఎలా సరిపోతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఇచ్చి న రేషన్‌కార్డులకు నిధుల పెంపు ఏది? అని ప్రశ్నించారు. దళిత సంక్షేమానికి నిధులు తగ్గించడాన్ని తప్పుబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అరకొర నిధులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపు లు, ఖర్చుల విషయంలో 10 నుంచి 15% వ్యత్యాసం ఉన్నదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీపీఎం నేత డీజీ నర్సింహారావు, రైతు సంఘం సీనియర్ నేత మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాంనాయక్, వృత్తిదారుల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ రమణ, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.