వరికి బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు పండించాలి. ధాన్యం ఒక్కటే పండించడం వల్ల భూసారం తగ్గుతుంది. కేంద్రం కొనకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే మా ప్రభుత్వం వరికి బదులుగా వాణిజ్య పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. వాణిజ్య పంటలు వేసుకొనే రైతులకు అవసరమైతే ప్రోత్సాహకాలు అందిస్తాం.
– మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు
కరీంనగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర సర్కార్.. ప్రత్యామ్నాయ పంటలైన పొద్దు తిరుగుడు, మక్కలు కొనడంలోనూ ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రంలో కొద్దిమొత్తంలో అదీ పరిమిత ప్రాంతాల్లో సాగుచేసిన ఆయా పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు రైతులు నానా యాతన పడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్న సీఎం మాటలు నీటిమూటలే అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం తమపై పగబడుతున్నదని, పంట అమ్ముకునే సమయంలో నట్టేట ముంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మార్కెట్లో పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్) ఆయిల్ ధరలు మండిపోతున్నా, దానికి ఉపయోగపడే గింజలు కొనకుండా సర్కార్ రైతులను సతాయిస్తున్నది.
మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను సాగుచేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్‌కు తీసుకొచ్చి 50 రోజలు అవుతు న్నా.. పొద్దుతిరుగుడు పంట కొనే దిక్కులేదు. కేవలం 2,883 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసింది. మార్క్‌ఫెడ్ డీఎం హబీబుల్లా రైతుల వద్దకు వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పి వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు పునఃప్రారంభమే కాలేదు. దీంతో దాదాపు 5,000 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కుప్పలు ప్రస్తుతం మార్కెట్‌యార్డులో ఉన్నాయి. మరో 3,000 క్వింటాళ్లు ఇంకా రైతుల వద్దే ఉన్నాయి. నిజానికి పొద్దు తిరుగుడు క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,700. కానీ కొనుగోలులో సర్కార్ జాప్యంతో రైతులు దళారులకు క్వింటా రూ. 5,500 నుంచి రూ.6,200కే తెగనమ్ముకుంటున్నారు. ఫలితంగా ఒక్కో క్వింటాపై రూ. 1,500 నుంచి రూ.2,200 నష్టపోతున్నారు.
సంచుల్లేవ్.. మీరే తెచ్చుకోండి
‘సంచుల్లేవ్.. మీకు మీరుగా కొనుగోలు చేసి తీసుకొని రండి’ ఇదీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులకు ఎదురవుతున్న దుస్థితి. ఇక్కడ మక్కలు అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సుమారు 4,000 క్విం టాళ్లకు పైగా మక్క నిల్వలున్నాయి. కనీసం గన్నీ సంచులను కూడా సమకూర్చలేని దుస్థితిలో సర్కార్ ఉన్నది. రైతులనే కొని తెచ్చుకోవాలని అధికారులు చెప్తున్నారు. దీంతో గత్యంతరం లేక 50 కేజీల బస్తా సంచి ఒక్కంటికి రూ.23 చొప్పున వెచ్చించి రైతులే కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. దీని ద్వారా సగటున ఒక్కో రైతుపై ఎకరానికి రూ.1,500 వరకు అదనపు భారం పడుతుంది. నిజానికి ఈసారి దిగుబడి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకే వచ్చింది. కానీ, అధికారులు మాత్రం 25 క్విం టాళ్లే కొంటున్నారు. మిగిలింది ప్రైవేట్‌కు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. వాణిజ్య పంటలపై సర్కార్ తీరు దీనికి నిదర్శనం.
పొద్దు తిరుగుడు తెచ్చి 45 రోజులైంది
నాకున్న ఏడెకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగుచేసిన. ఈ ఏడాది 55 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట బాగొచ్చిందని సంబురపడ్డ. కానీ, ఆ సంబురమే లేకుండా పోయింది. ఇల్లంతకుంటలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి 45రోజుల క్రితం పొద్దుతిరుగుడు గింజలు తెచ్చిన. కానీ, కొనెటోళ్లే లేరు. చూసీచూసీ విసిగిపోయిన. ప్రైవేట్ వ్యాపారికి క్వింటాకు రూ.6,200 చొప్పున గురువారం అమ్ముకున్న. పంటమార్పిడి చేయాలన్న సర్కార్ పట్టించుకోకే అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకొని నష్టపోతున్న.
– కొమ్మరెడ్డి కిశోర్‌రెడ్డి, రైతు, బాలనగర్, వేములవాడ మండలం
లక్ష వరకు నష్టమొస్తది
నాకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పొద్దుతిరుగుడు సాగుచేసిన. 70 కింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గింజలను నెల క్రితమే ఇల్లంతకుంట మార్కెట్ యార్డుకు తెచ్చిన. మేం పంట సాగు చేసినప్పుడే అధికారులకు చెప్పి రికార్డుల్లో రాయించినం. ఇప్పుడు సర్కార్ కొననంటుంది. ఇప్పుడు దళారులకు అమ్ముకొంటే రూ.లక్ష వరకు నష్టం వస్తది. దీన్ని ఎలా భరించాలి? ఇట్లయితే మేమెలా బతకాలి? పొద్దుతిరుగుడు రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకుంటలేదు.
– గుర్రం వినోద్‌రెడ్డి, రైతు, పత్తికుంటపల్లి
10వేలతో 450 గన్నీ సంచులు కొన్న
కరీంనగర్ మార్కెట్‌కు మక్కలు తెచ్చి 10 రోజులు దాటింది. సంచులు రావు కొనుక్కోమని చెప్పిన్రు. తప్పని పరిస్థితుల్లో బయట ఒక్క సంచికి రూ.23 పెట్టి 450 సంచులు కొన్న. అందుకు రూ.10 వేలు దాటినయి. సంచులు మేం కొనుక్కునుడు ఏంది? మక్కలు వస్తాయని ముందే అధికారులకు ముందే తెలుసు. సంచులు ఇవ్వకుండా సర్కార్ మమ్మల్ని ఇబ్బందులు పెట్టుడేంది? నేను ఇంతకు ముందు పత్తి వేసిన. అప్పుడు వానలకు సరిగా దిగుబడి రాలేదు. దాని అడుగునా మక్క వేసిన. దిగుబడి మంచిగానే వచ్చింది. కానీ, ఏం లాభం లేకుండా పోయింది. – అమిరిశెట్టి తిరుపతి, రైతు (కరీంనగర్ జిల్లా)
లారీలు లేవని లోడింగ్ చేయలే..
మార్కెట్‌కు మక్కలు తెచ్చి 15 రోజులుదాటింది. అప్పటి సంది సంచుల కోసం తిరిగినం. మూడు రోజుల కింద కొని మక్కలు నింపినం. ఎట్టకేలకు బుధవారం కాంటా పెట్టిన్రు. కానీ, లారీలు లేవని లోడింగ్ చేయలేదు. అవి రావడానికి ఇంకా సమయం పడుతుందంటున్రు. అప్పటి దాకా సంచుల దగ్గర కాపలా ఉండే బాధ్యత మాదేనని అధికారులు చెప్పిన్రు.
– ఊరడి మల్లయ్య, రైతు, గోపాల్పూర్, కరీంగనర్ జిల్లా