హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ) : పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతున్నది. ఎల్అండ్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను హడావుడిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని లేని భారాన్ని రాష్ట్రంపై వేసింది. సరైన ప్రణాళిక, ముందస్తు ఆర్థిక ఏర్పాట్లు లేకుండా ప్రైవేట్ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్వాధీన ప్రక్రియ చేపట్టిన సర్కార్ మెడకు వడ్డీల ఉరితాడు బిగుస్తున్నది. రుణాల రీ ఫైనాన్సింగ్ ప్రక్రియలో దొర్లిన తప్పిదాలతో జరుగుతున్న జాప్యం వల్ల ఒక్క 50 రోజుల్లోనే రూ.130 కోట్ల ప్రజాధనాన్ని వడ్డీ రూపంలో చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఇదంతా ప్రజల సొమ్మును సర్కారే బూడిదలో పోసిన పన్నీరు వ్యవహారంలా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోన్ ప్రక్రియ సందిగ్ధంలో పడటం, కేంద్రంతో సమన్వయ లోపం, అధికారుల తప్పిదాలు ఐఆర్ఎఫ్సీ రుణాల విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎల్అండ్టీ ఇన్నాళ్లూ చెల్లించిన వడ్డీ లెక్కన రూ.13,600 కోట్లకు రోజుకు దాదాపు రూ.2.5-3.0 కోట్ల వడ్డీభారాన్ని సర్కార్ మోస్తున్నది. ఐఆర్ఎఫ్సీతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు గడిచిన 52 రోజుల్లో ఏకంగా వడ్డీ భారం రూ.130 కోట్లకు చేరిందని సమాచారం. తక్కువ వడ్డీ రేటుతో రుణం వస్తుందని భావించి, లోన్ మొత్తం మంజూరు కాకముందే.. తొందర పడి బాధ్యతలు నెత్తిన వేసుకోవడం వల్ల ఇలా వందల కోట్ల రుణ భారాన్ని రాష్ట్రం మోయాల్సిన పరిస్థితి వచ్చిందనే చర్చ నడుస్తున్నది.
ఈ మొత్తం వ్యవహారంలో సర్కార్ చేసిన తప్పిదం ఖజానాకు గుదిబండగా మారితే.. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూరే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేండ్లుగా మెట్రో నిర్వహణ భారమై, కొవిడ్ నష్టాలు, భారీ వడ్డీలతో దాదాపు రూ.8 వేల కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్న ఎల్అండ్టీ సంస్థ భారాన్ని.. పెద్దరికానికి పోయి సర్కార్ నెత్తిన వేసుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. రెండో దశ మెట్రో విస్తరణ పేరిట ప్రభుత్వం వేసిన తప్పటడుగు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా ఎల్అండ్టీ మోస్తున్న రూ.400 నుంచి రూ.600కోట్ల నష్టాలను కూడా సర్కార్ ఖాతాకు మళ్లింది. దీంతో ఆ కంపెనీకి పరోక్షంగా లబ్ధి కలుగగా నెలవారీ వడ్డీలను సర్కార్ కట్టుకోవాల్సి వస్తున్నది. యాజమాన్యం బదిలీ అయినందున, రుణాల రీ ఫైనాన్సింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పాత వడ్డీ రేట్ల ప్రకారం (8-9శాతం) భారాన్ని ప్రస్తుతానికి సర్కార్ మోయాల్సి వస్తున్నది. భవిష్యత్తులో మెట్రో ఆపరేటర్ అయినా ఫ్రెంచ్ సంస్థ కియోలిస్‌కు చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ మెడకు చుట్టుకోనున్నాయి. ఇలా ఓ ప్రైవేట్ సంస్థ మెడకు చుట్టుకున్న వడ్డీల భారాన్ని ఎందుకు సర్కార్ నెత్తిన వేసుకున్నదనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 యాజమాన్యాన్ని ఎల్ అండ్ టీ నుంచి బదలాయించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎల్అండ్టీ సంస్థకున్న రూ.13,600 కోట్ల భారీ రుణాన్ని ప్రభుత్వం పేరిట బదిలీ చేయించుకున్నది. అయితే ఇందులో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి లభిస్తుందని భావించి చేపట్టిన రుణ ప్రక్రియ సర్కార్ ఖజానాకు గండి పెట్టినట్టుగా మారింది. రీ ఫైనాన్సింగ్ ప్రక్రియతో సర్కార్‌పై నెలవారీ వడ్డీ భారం రూ.80 కోట్లకు పరిమితమవుతుందని సంబురపడిన పాలకుల అంచనాలు తప్పడంతో ఇప్పుడొక గుదిబండలా రూపాంతరం చెందుతున్నది.