హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సరిహద్దుల నుంచి తెలంగాణలోకి అక్రమ మద్యం రాకుండా రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సమర్థంగా అడ్డుకున్నారు. ఈ ఏడాది నమోదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసులు, ఎన్డీపీఎస్ కేసుల వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు. ప్రభుత్వానికి డ్యూటీ చెల్లించకుండా అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకొచ్చిన కేసులు 2022లో 579 నమోదు కాగా.. ఈ ఏడాది ఆ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. 2023 డిసెంబర్ 25 నాటికి 1,848 ఎన్డీపీఎల్ కేసులు నమోదైనట్టు తెలిపారు. వీటిల్లో 1,006 మందిని అరెస్టు చేసి, 151 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎల్ కేసుల ఉల్లంఘనల ద్వారా సుమారు రూ.6 లక్షల ఫైన్ వసూలు చేశారు. గతేడాది 11,395 లీటర్లు, ఈ ఏడాది 29,849 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది 9,998 గుడుంబా కేసులు నమోదవగా.. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో 21,831 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 12,436 మందిని అరెస్టు చేసి, తరచుగా గుడుంబా అమ్ముతున్న 14 మందిపై పీడీ యాక్టు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 1,36,143 లీటర్ల గుడుంబా, 6,73,425 కేజీల తాటిబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 63,60,032 లీటర్ల పానాకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఏడాది 1,890 వాహనాలను స్వాధీనం చేసుకొని, రూ.1,54,45,000 జరిమానా విధించారు. ఈ ఏడాది 11,119 మందిని బైండోవర్ చేయగా.. 102 మందికి శిక్షతోపాటు జరిమానా కూడా విధించినట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలిపారు.