హైదరాబాద్, జూలై29 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వార్డులవారీగా ఓటర్ల జాబితా తయారీ, పబ్లికేషన్, అభిప్రాయాల సేకరణకు సంబంధించి అధికారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కొక్క జిల్లా నుంచి ఐదుగురు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తూ, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ మినహాయించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాల నుంచి ఐదుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు లేదంటే అధికారులను ఒక రోజు శిక్షణకు పంపించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా శిక్షణకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు ఆగస్టు 2,3 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీ ఇన్స్టిట్యూట్లో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది.
3న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది.