భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 22, 60, 58, 55వ డివిజన్లతోపాటు కూలీలైన్, జీఆర్బస్తీలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 శాతం సర్పంచులను గెలుచుకుని సత్తా చాటడంతో కాంగ్రెస్ మంత్రులు ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్, పరిషత్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.