బీఆర్ఎస్ శ్రేణులే నా బలం. నన్ను నడిపించే శక్తి మీరే. నేను పిడికెడు మందితో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, నన్ను నమ్మి వచ్చి, ఊరూరా కథానాయకులై కదిలారు. పార్టీ కోసం కష్టపడ్డారు. రాష్ట్రం కోసం పరితపించారు. అటువంటి మీకు నేను ఏమిచ్చినా రుణం తీరదు. తల్లికోడి తన పిల్లలను కాపాడుకున్నట్టే, నేను మిమ్మల్ని కాపాడుకుంట. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా.
కుటుంబ సభ్యులను కోల్పోయిన పార్టీ కార్యకర్తలు, నేతల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు మేమందరం ఉన్నం. మనందరికీ పార్టీ ఉన్నది, పెద్ద దిక్కు కేసీఆర్ ఉన్నరు. అందరినీ ఆదుకుంటరు. మనోధైర్యంగా ఉందాం. పట్టుదలతో ముందుకు సాగుదాం.
వరంగల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ గుండెల్లో ఉన్నట్టే, ఆయన మానవీయ స్పర్శను జీవితాంతం వెంటబెట్టుకున్నట్టే అని గులాబీ శ్రేణులు చెప్తుంటాయి. పార్టీ తమకు అనుక్షణం అండగా ఉంటుందని భరోసాగా ఉంటాయి. ఇది అక్షర సత్యమని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబం విషయంలోనూ తేటతెల్లమైంది. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలు, నాయకుల పట్ల బీఆర్ఎస్ పార్టీ చూపించే ఔదార్యం మరే పార్టీ చూపించదని గులాబీ శ్రేణులు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు పార్టీ తరఫున రూ.2 లక్షల ప్రమాద బీమా చేయించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ప్రకటించడం వరకేగానీ, బీఆర్ఎస్లా క్రమం తప్పకుండా ప్రమాదబీమా వర్తింపజేసిన పార్టీ మరొకటి లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా కార్యకర్త మరణిస్తే క్లెయిమ్ చేసి, ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. 2015-16 నుంచి ఇప్పటి దాకా సుమారు 5,600 కుటుంబాలు రూ.110 కోట్ల పైచిలుకు ప్రమాద బీమా క్లెయిమ్స్‌ను పొందినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర ప్రగతి పయనంలో తనతో నడిచిన ఉద్యమకారులు, పార్టీ క్యాడర్‌ను బీఆర్ఎస్ అధినేత గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు. పార్టీ పదవులతోపాటు వేలాది మందికి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా రాజకీయ అవకాశాలు కల్పించారు. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ప్రజా ఉద్యమ గాయకుడు సాయిచంద్, బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన కుసుమ జగదీశ్, తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిసహా మరికొందరు నాయకులు అకాలమరణం చెందితే వారి కుటుంబాలకు కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలిచారు.
తన సహచరులకు ఏదైనా జరిగితే కేసీఆర్ తల్లడిల్లిపోతుంటారు. పార్టీ అనుక్షణం తోడుగా ఉండి కాపాడుకుంటుంది. ఇందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. గత నెల 26న పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావును పురమాయించారు. తక్షణమే వరంగల్‌కు వెళ్లి పెద్దికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారు, పార్టీ ఇతర ముఖ్యనాయకులు హుటాహుటిన వరంగల్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఏం జరుగుతున్నదో కేసీఆర్ నిత్యం వాకబు చేయడమే కాకుండా, ప్రత్యక్షంగా దవాఖానకు వెళ్లి పరామర్శించి, పెద్ది ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. చికిత్స పొందుతూ కన్నుమూసినప్పటి నుంచి అంతిమయాత్ర జరిగేదాకా పార్టీ మొత్తం సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మొత్తం పార్టీ కేడర్ పెద్ది కుటుంబానికి, నర్సంపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా నిలువాలని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సుదర్శన్‌రెడ్డి భౌతికంగా వెళ్లిపోయినా పార్టీ పెద్దదిక్కుగా నిలబడిందనే సంకేతాన్ని ఇచ్చారు. మరోవైపు ఈ నెల 10న నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభను నిర్వహించేందుకు నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటున్నారు. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ రెండువారాలుగా ఒక నాయకుడికి, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన వైనంపై రాజకీయాలకు అతీతంగా చర్చసాగుతున్నది. పెద్ది వంటి నిబద్ధత గల కార్యకర్తకు బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, చూపుతున్న ఆదరణ అన్ని రాజకీయ పార్టీలకు పాఠంలా నిలుస్తుందని చెప్తున్నారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలు మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి చేతులు దులుపుకుంటాయి. లేదా పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం ప్రకటిస్తుంటాయి. కానీ కేసీఆర్ తన ఉద్యమ సహచరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు. తనతో నడిచిన నేతలు, కార్యకర్తలు ఎవరైనా మరణిస్తే వారి భార్యాపిల్లలకు భరోసా ఇవ్వడంతోపాటు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, సోదరీమణులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సాయించంద్ కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయంలో తండ్రికి, సోదరికి రూ.25 చొప్పున కేటాయించారు. కుసుమ జగదీశ్ తల్లిదండ్రులకు రూ.25 లక్షలు అందజేశారు. తాజాగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లికి రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా పార్టీ కార్యకర్తలు, నేతల తల్లిదండ్రుల గురించి ఒక పార్టీ ఆర్థికంగా ఆదుకోవడం రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.