హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్‌లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికలు 23 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండమో, లిట్మస్ టెస్టో కాదని చెప్పారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిమితిని దాటి, భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశంగా మారిన విషయం తెలిసిందే. గెలుపు కోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళికలు రూపొందించిన రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని జూబ్లీహిల్స్లోనే మోహరించారు. అదీ సరిపోక అజారుద్దీన్‌కు అగమేఘాల మీద మంత్రి పదవి ఇచ్చారు.
ఆయనను మైనార్టీల ప్రతినిధిగా వేదిక మీద నిలబెట్టి ఓట్లు అడిగారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ పార్టీకి లిట్మస్ టెస్ట్‌గా భావిస్తారా?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ‘ఈ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ బంధానికి లిట్మస్ టెస్టు లాంటిది’ అని చెప్పుకొచ్చారు. కానీ, తన పాలనకు ఇది లిట్మస్ టెస్టు అని మాత్రం ఒప్పుకోలేదు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికలను రెఫరెండంగా భావించేందుకు అంగీకరించని రేవంత్‌రెడ్డి తాజాగా లిట్మస్ టెస్టుగా కూడా ఒప్పుకోకపోవడంతో ఉప ఎన్నికల ఫలితాలు చేజారిపోతాయని ఆయనకు స్పష్టమైన సమాచారం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లకు గాను ఏడు డివిజన్లలో తిరిగి ప్రచారం చేసినట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. స్వయంగా తానే క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా చూడటంతో పాటు, ప్రజల స్పందనను బట్టి తానొక అంచనాకు వచ్చానని చెప్పుకొచ్చారు. తన అప్రోచ్‌లో తేడాలుంటే కరెక్షన్ చేసుకుంటామని చెప్పారు. ‘2023 ఎన్నికల ఫలితాలను 6నెలల ముందుగానే చెప్పిన. ఏ ఉప ఎన్నికలో కూడా మీకు డిపాజిట్లు రావడంలేదు.. ఎట్లా అధికారంలోకి వస్తరు అని నన్ను అప్పుడు విలేకరులు అడిగిండ్రు. వచ్చే ఫలితాల్లో కాంగ్రెస్‌కు 64-65 సీట్లు గెలుస్తం రాసుకోండని చెప్పిన.
బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందని చెప్పిన. అప్పుడు చెప్పిన దాంట్లో ఒక్క సీటైనా ఫరక్ వచ్చిందా?’ అంటూ విలేకరులనే అడిగారు. 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే బీజేపీ ఒక్క సీటు దాటదని నేషనల్ మీడియా ఇంటర్యులో ఓపెన్‌గా చెప్పానని వివరించారు.‘నేను ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తాను కాబట్టి ప్రజల ఆలోచనను అంచనా వేసుకుంట. డబ్బులిస్తే అనుకూలంగా సమాచారం ఇచ్చే వాళ్లను ఒక అంశం కిందనే పరిగణిస్త’ అంటూ పలు అంశాలపై మాట్లాడిన ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అంశాన్ని మాత్రం దాటవేశారు. పైకి మేకపోతు గాంభీర్యంతో గెలుస్తామని చెప్పినా ఇది తమ పాలనకు రెఫరెండంగా, లిట్మస్ టెస్టుగా తీసుకుంటామని మాత్రం చెప్పలేదు.
రెండు రోజుల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలోనూ రేవంత్‌రెడ్డి ఇదే తరహా సమాధానం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ రెండేండ్ల పరిపాలనకు రెఫరెండగా భావిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి బదులిస్తూ రెఫరెండం అనేది కాలం చెల్లిపోయిన అర్థంపర్థం లేని మాటలు అని కొట్టిపారేశారు. తన పాలనకు రెఫరెండం కాదని పరోక్షంగా స్పష్టంచేశారు. ప్రతి ఎన్నిక తమ ప్రభుత్వ పనితనానికి పరీక్షేనని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్లోనూ ఇవే మాటలను పునరావృతం చేశారు.