BRS | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా చేసిందీ, సాగును సంబురంగా మార్చిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. సాగునీటిని అందించడం, పంటల సాగు, పంటల ఉత్పత్తిలో కూడా నాటి కేసీఆర్ ప్రభుత్వం అద్భుత ఫలితాలు సాధించిందని వివరించారు. 2013-14 నుంచి 2022-23 మధ్యకాలంలో వ్యవసాయం, సాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యమని స్పష్టంచేశారు.
ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్న గణాంకాలను బుధవారం కేటీఆర్ ఎక్స్‌లో వెల్లడించారు. ఎవరో దాచేస్తే దాగని సత్యాలు ఇవని, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అద్భుతాలని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతుబంధు సహా అనేక వ్యవసాయ అనుకూల విధానాల వల్ల వచ్చిన సత్ఫలితాలు ఇవని తెలిపారు. చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.