జగిత్యాల, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆయకట్టు రైతులను భయపెడుతున్నది. జూలై రెండో వారం మొదలైనా కేవలం 15.400 టీఎంసీల నీరే ఉండటం, అందులోనూ ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉండాల్సిన పరిస్థితుల్లో 10 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వానకాలంలో పంటలు ఎలా సాగుచేయాలన్న భయం వారిని వెంటాడుతున్నది. 2023 మే, జూన్ నెలల్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయి, వానకాలం పంటలకు, ముఖ్యంగా నార్లు పోసుకునేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు.
2023లో ఆదుకున్న కేసీఆర్
మూడేండ్ల క్రితం అంటే.. 2023 ఏప్రిల్ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడం ప్రారంభమైంది. మే చివరి నాటికి పదిహేను టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నది. జూన్ మొదలై మూడు వారాలు గడిచినా, ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాతోపాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు పడలేదు. దీంతో కరువు వాతావరణం ఏర్పడింది. ఆయకట్టులో నార్లు పోసుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బందులుపడే దుస్థితి వచ్చింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ చివరి వారంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులతోపాటు కాళేశ్వరం నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై, కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రక్రియ ద్వారా ఎగువకు పంప్ చేయాలని ఆదేశించారు. వరద కాలువకు ఆధారంగా ఉన్న తూముల ద్వారా కాళేశ్వరం నీటిని చెరువులు నింపాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో 2023 జూలై 7నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభించారు.
వరద కాలువ పరీవాహక ప్రాంతాలుగా ఉన్న మల్యాల మండలం పోతారం, రాజారం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి మండలాలకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రక్రియ జీవం పోసింది. వరద కాలువలకు ఏర్పాటు చేసిన 34 తూముల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించడంతో నాన్ ఆయకట్టు పరిధిలోని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. జలకళ లేక కళావిహీనంగా మారిన పల్లెలు తిరిగి జీవం పోసుకున్నాయి. రాంపూర్, రాజేశ్వర్రావుపేట, నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్‌హౌస్‌లను దాటుకొని కాళేశ్వరం జలాలు ప్రాజెక్టులోకి చేరాయి. 2.55 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా తరలించి ఎస్సారెస్పీలోకి చేర్చారు. గోదావరి నదిని దాటుకొని వెళ్లిపోయిన నీటిని మళ్లీ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడాన్ని, తమ పొలాల్లోకి తరలించడాన్ని రైతులు సంభ్రమాశ్చర్యాలతో స్వాగతించారు. కేసీఆర్ చేసిన పనికి సంతోషించారు. 2023 జూలై 22 తర్వాత ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం వచ్చి, ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరడంతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రక్రియను ఆపివేశారు.
నీటికోసం నేడు ఎదురుచూపులు
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం తక్కువగా నీరు ఉండటంతో జగిత్యాలతోపాటు కరీంనగర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023 నాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నదనే చెప్పాలి. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో జూలై 7 (మంగళవారం) నాటికి కేవలం 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉన్నది. ఈ పదిహేను టీఎంసీల నీరు ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొన్నది. ప్రాజెక్టు నిబంధనల ప్రకారం 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీగా ప్రాజెక్టులో ఉంచాల్సిందే. మిగిలిన 10 టీఎంసీల్లో నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని అందించాల్సి ఉన్నది. అలాగే నీటి ఆవిరి సైతం గణనీయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పది టీఎంసీల నీరు సైతం ప్రాజెక్టులో అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది. జూలై రెండో వారం మొదలైనా ఇంతవరకు ప్రాజెక్టులోకి అనుకున్న స్థాయిలో నీటి ప్రవాహం రావడం లేదు.
చెరువుల్లోనూ తగ్గిన నీరు
మేలో వరద కాలువకు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి, నాన్ ఆయకట్టు మండలాలైన మల్యాల, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లోని కొన్ని చెరువులను నింపారు. మూడు నెలలు గడిచిపోవడంతో చెరువుల్లో నీటి శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ చెరువుల్లో అరువై శాతానికి మించి నీళ్లు లేవు. భూగర్భజలాలు సైతం మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడం, వర్షాల జాడ లేకపోవడం, చెరువుల్లోనూ నీరు తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం నుంచి ఎత్తిపోసి, చెరువులను నింపడంతోపాటు ప్రాజెక్టు వరకు నీటిని కేసీఆర్ హయాంలో తరలించిన విధంగా నీటిని మళ్లించాలని వేడుకుంటున్నారు. పునరుజ్జీవ పథకం ప్రారంభించిన తర్వాత వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీరు వస్తే సరేసరే.. లేకుంటే పునరుజ్జీవ పథకం నీటితోనే సేద్యం సాధ్యమవుతుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.