ఖైరతాబాద్, ఆగస్టు 1 : అత్యంత రద్దీ ప్రాంతమైన ఖైరతాబాద్ చౌరస్తాలో అది కూడా జలమండలి ప్రధాన కార్యాలయం సమీపంలోనే డ్రైనేజీ నీరు నెలరోజులుగా రోడ్డుపై ఉబికి వస్తోంది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. జలమండలి కార్యాలయానికి అడుగుదూరంలోనే మురుగునీరు రోడ్డుపై ఏరులై పారుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యంగా ఉదయం వేళ.. మురుగు నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భరించలేని దుర్వాసన వస్తున్నది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు ఆ మురుగు నీటి మీదుగానే వెళ్తూ.. అవస్థలుపడుతున్నారు.
రోజుల తరబడి మురుగునీరు రోడ్డుపై ఉండడంతో దోమలు వ్యాపించి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన సమయంలో డ్రైనేజీ, వర్షపు నీటితో కలిసి సమస్య మరింత తీవ్రరూపం దాల్చి రోడ్డుపై ఎక్కడ గుంతలున్నాయో గుర్తించలేని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. ఈ మార్గంలో ప్రతి రోజు వేలాది మంది ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. జలమండలి కార్యాలయం సమీపంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.