Revanth Reddy | జగిత్యాల, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సాగునీటి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగానే వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడిగడ్డ బరాజ్‌లో స్వల్పమైన మరమ్మతులు చేసి, కాళేశ్వరం జలాలను వినియోగంలోకి తీసుకురాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ, తెలంగాణ అన్నదాతలను గోస పెడుతున్నదని రైతులు, రైతుసంఘాల నేతలు, నీటిపారుదల నిపుణులు మండిపడుతున్నారు. సహజంగా వచ్చిన వరద నీటిని కూడా ఒడిసి పట్టి, వాటిని ప్రాజెక్టులోకి మరలించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అశ్రద్ధ, అధికారుల అసత్వంతో ఎస్సారెస్పీకి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. భారీ నీటిని కాకతీయ, వరద కాలువల్లోకి మళ్లిస్తే.. ఎల్ఎండీ, మిడ్ మానేరులోకి చేరుకునేవని, ఆ ప్రాజెక్టులకు జలకళ వచ్చేదని, రైతులకు మేలు జరిగేదని వివరిస్తున్నారు.
ప్రభుత్వం, అధికారులు విజ్ఞతతో పనిచేస్తే మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకునే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వచ్చే ప్రధాన కాలువ ద్వారా నీటిని ఎల్ఎండీలోకి తెచ్చి, అక్కడి నుంచి దిగువకు నీటి వదిలితే ఎస్సారెస్పీ 2వ స్టేజీలో ఉన్న కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు నీరు అందించవచ్చని చెప్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించింది. 22వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించి మిడ్ మానేరులోకి, అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. ఆగస్టు 7 నుంచి కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువలోకి వదలడం మొదలు పెట్టారు. అయితే 40 టీఎంసీల కంటే నీరు తక్కువగా ఉందన్న సాకుతో వరద కాలువకు నీరు విడుదల చేయలేదు. 15వ తేదీ నాటికే ప్రాజెక్టులో దాదాపు 50 టీఎంసీల నీరు ఉండగా, వరద కాలువకు నీటిని విడుదల చేసి, మిడ్ మానేరులోకి నీటి తరలించే విషయంలో నిర్లక్ష్యం వహించారు. 18వ తేదీ తరువాత వరద కాలువలోకి నీటి విడుదల చేపట్టారు. అలాగే, కాకతీయ కాలువకు సైతం పెద్ద మొత్తంలో నీటి విడుదల చేయలేదు. ప్రభుత్వానికి ముందు జాగ్రత్త చర్య లేకపోవడంతో ఒక్క ఆగస్టు నెలలోనే 51 టీఎంసీల నీరు గోదావరి నది పాలైందని అధికారులు వివరిస్తున్నారు.
ఆగస్టు 13 నుంచి విస్తృత వర్షాలు, వరదల నేపథ్యంలో అదే రోజు ఎస్సారెస్పీ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువకు విడుదల చేసి, వాటిని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి తరలించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు నిండి ఉండేదదని నిపుణులు తెలిపారు. రోజుకు రెండు టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వస్తే, ప్రాజెక్టు స్వరూపమే మారిపోయి ఉండేదని వివరిస్తున్నారు. మిడ్ మానేరులోకి రోజుకు రెండు టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా కొండపోచమ్మసాగర్ వరకు తరలించే అవకాశం ఉండేదని చెప్తున్నారు. 17న తేదీ వరకు వరద కాలువకు నీటిని వదలకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషిస్తున్నారు. అలాగే కాకతీయ కాలువకు కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి ఉంటే, ఎల్ఎండీ జలకళ సంతరించుకొని ఉండేదంటున్నారు. 7వ తేదీ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు కాలువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ సామర్థ్యం 11వేల క్యూసెక్కులు కాగా, కనీసం 10 వేల క్యూసెక్కుల నీటిని పంటలకు, ఎల్ఎండీలోకి తరలిస్తే జలాశయం నిండి ఉండేదని పేర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం, సర్కార్ పట్టింపులేనితనంతో ఎస్సారెస్పీలోకి వచ్చిన లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వృథాగా వదిలిపెట్టాల్సిన దుస్థితి వచ్చిందని వివరిస్తున్నారు.
జూన్, జూలైలో ఉత్తర తెలంగాణకు వరదాయిని అయిన ఎస్సారెస్పీలో నీటి మట్టం కనిష్టస్థాయిలోనే ఉంది. జూలై మూడో వారం నుంచి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు దాదాపు 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. ఆగస్టు 15న సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 47.25 టీఎంసీల నీరు ఉండగా, 34097 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఆ రోజు రాత్రి 9 గంటలకు 58,321 క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరింది. ఆ రోజు మధ్యాహ్నం వరకు 89 వేల క్యూసెక్కులకు, సాయత్రం 5 గంటల వరకు 1,04,879 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో 17న మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాజెక్టులోకి 56.308 టీఎంసీల నీరు చేరింది. 17న రాత్రి 12 గంటలకు 1,29,393 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి నమోదు అయ్యింది. 10 గంటల వరకు 1,51,806 క్యూసెక్కులకు నీటి ప్రవాహం పెరిగింది. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నికరంగా ప్రాజెక్టులోకి లక్షలాది క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తూనే ఉంది. 19వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి గేట్లను ఎత్తి, నీటిని గోదావరిలోకి వదిలే ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులు 25వ తేదీ వరకు కొనసాగిస్తూనే వచ్చారు.