హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/న్యూస్‌నెట్‌వర్క్: నాగార్జునసాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోగా దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌కు 3.15 లక్షల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వస్తున్నది. దీంతో డ్యాం 43 గేట్లను తెరిచి 3,11,575 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండటంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. దాంతో ఇప్పటికే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వస్తున్న నీటితో కలిపి మొత్తం 1,62,466 క్యూసెక్కుల నీరు సాగర్‌కు చేరుకుంటున్నది. నాగార్జునసాగర్ జలాశయంలో వారం రోజుల్లో 9 అడుగుల నీటి మట్టం పెరిగి సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 512.60 అడుగులకు చేరుకున్నది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా, నీటి నిల్వ 136.13 టీఎంసీలుగా ఉన్నది.
మహదేవపూర్/కాళేశ్వరం/కన్నాయిగూడెం, జూలై 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ సోమవారం సాయంత్రానికి 4,75,210 క్యూసెక్కులకు చేరుకున్నది. బరాజ్‌లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే తెలంగాణ) : 8 రోజులుగా భద్రాద్రి మన్యాన్ని ఓ కుదుపు కుదిపిన వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో భద్రాచలానికి వరద గండం తప్పింది. ఆదివారం రాత్రి వరకు మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద సోమవారం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.