హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందకపోవడంతో.. వైద్యానికి డబ్బుల్లేక రోజుకొక గుండె ఆగిపోతున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో గురువారం ఉద్యోగుల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డీఈవో కార్యాలయం వద్దనే గుండెపోటుతో చనిపోయారని గుర్తు చేశారు. ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్సీ కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేసైనా సరే.. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలని శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారులో బడా కాంట్రాక్టర్లలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే బిల్లుల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అన్నారు. సీపీఎస్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రతి నెల మినహాయించుకుంటున్న డబ్బును ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుంటున్నదని విమర్శించారు.
సీపీఎస్ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 కోట్ల చొప్పున ఇప్పటివరకు మొత్తం రూ.1300 కోట్ల వసూలు చేసి వాడుకున్నదని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మును వాడుకోవడం చట్టరీత్యా నేరమని, అదే ప్రైవేటు కంపెనీలు పీఎఫ్ మొత్తాన్ని జమ చేయకపోతే ఆ యజమానిపై కేసులు పెడుతారని అన్నారు. ఉద్యోగుల సొమ్మును ప్రాన్ అకౌంట్లో జమ చేయకపోతే.. ఆ శాఖలకు చెందిన అధిపతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉద్యోగుల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక పక్క ఇప్పటికే కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం(సీపీఎస్) అమలు చేస్తుంటే.. మరో పక్క యూనిఫైడ్ పెన్షన్ విధానం (యూపీఎస్) కొత్తగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందని, ఇది మంచి విధానం కాదని పేర్కొన్నారు. గత ఎన్నికల హామీలో భాగంగా పాత పెన్షన్ విధానం అమలుచేయాలని తాము డిమాండ్ చేస్తుంటే.. మరో పక్క కేంద్రం యూపీఎస్ విధానాన్ని తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. యూపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2026 కంటే ముందుగా.. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించే బెనిఫిట్ల విషయంలో కేంద్రం తెచ్చిన చట్టాలు హానికరంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతలను స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన జీవోను వ్యతిరేకిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. టీచర్లకు తనిఖీల బాధ్యతలు అప్పగిస్తే.. ఆ ప్రభావం బోధనా విధానాలపై పడుతుందని అన్నారు. ఒక సబ్జెక్టు టీచర్‌ను తరగతి గదిలో పాఠాలు చెప్పించకుండా.. తనిఖీల పేరుతో స్కూళ్లకు తిప్పడం సరైన చర్య కాదని ధ్వజమెత్తారు. స్కూల్ తనిఖీల కోసం మండల విద్యాధికారులు (ఎంఈవో)లు, మండల రిసోర్స్ పర్సన్స్ (ఎంఆర్పీ)లతో పాటు గెజిటెడ్ హెడ్మాస్టర్లు ఉన్నారని, వారితోనే తనిఖీలు చేయించాలని డిమాండ్ చేశారు. ఇంతకు రాష్ట్రంలో విద్యా కమిషన్ ఉందా? ఇప్పటివరకు ఈ కమిషన్ అతీగతి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, ఆ సంఘం నేత భుజంగరావు, ఉద్యోగ సంఘం మాజీ నాయకుడు హమీద్ పాల్గొన్నారు.