హైదరాబాద్, జూన్ 21 (నమస్తేతెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్రశంసించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రు లు వీ శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా నేతలు తుల ఉమ, సుమిత్రా ఆనంద్ తనోబా తదితరులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన వర్ధంతి సభలో మధుసూదనాచారి మాట్లాడారు. నాడు జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణను కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతిఒక్కరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ సార్ చూపిన మార్గంలో మనమందరం పయనించాలని పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్‌గా, తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశంసించారు. జయశంకర్ సార్ బతికినంత కాలం తెలంగాణ కోసమే పరితపించారని దేవీప్రసాద్ కొనియాడారు. ఆ మహనీయుడి జీవితం మనందరికీ ప్రేరణగా నిలుస్తుందని తుల ఉమ చెప్పారు. సార్ జీవితాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ ఉద్బోధించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, తుంగ బాలు, కురువ విజయ్‌కుమార్, రంగినేని అభిలాష్, కిర్తీలత పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు సముచిత గౌర వం ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ సర్కారు భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సార్ పేరు పెట్టి సమున్నతంగా గౌరవించిందని గుర్తుచేశారు. శనివారం కేటీఆర్ ఎక్స్ వేదికగా జయశంకర్ సార్‌కు ని వాళులర్పించారు. తెలంగాణ కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జయశంకర్‌సార్ అని కొనియాడారు. మలి దశ పోరాటంలో కేసీఆర్‌కు గురువులా ఉంటూ ముందుకు నడిపించిన ‘సార్’ భౌతికంగా మన మధ్యలేకున్నా ఆయన ఆశయాలు, ఆకాంక్షలు కండ్లముందు కదలాడుతున్నాయని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా బతికిన జయశంకర్ సార్ ఆశయ సాధనకు నేటి తరం అంకితం కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చా రు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానమని పేర్కొన్నారు. సార్ మార్గదర్శకత్వం, కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని తెలిపా రు. ‘బాధిత సమాజం గళం విప్పినప్పుడు విద్యావంతులు కలం పట్టాలి’ అని ఉద్బోధించిన జయశంకర్ సార్‌కు శనివారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.