Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారని పేర్కొన్నారు. నేను చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. మున్సిపల్ ఎన్నిలక ముందు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ చేస్తలేమని డీజీపీ చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్ చేసే పనులకు ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. హామీలు అమలు చేయలేక.. పోలీసులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. పోలీసులతోనే నామినేషన్లు వేయిస్తున్నారని పేర్కొ్న్నారు. జడ్చర్లలో కాంగ్రెస్ నాయకుడు ఎస్సై గల్లా పట్టుకున్నాడని తెలిపారు. పోలీసులను కొడుతుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. నిజాయితీగా పనిచేసే పోలీసులను లూప్లైన్లో పెడుతున్నారని అన్నారు.
జీవితాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు ఆ వ్యవస్థలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఓయూ, అశోక్ నగర్ వెళ్లి మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేదన్నారు. అరాచక శక్తులు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని విమర్శించారు.