Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించిందని మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ,ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు.
బీసీల్లో ఎక్కువ మంది వృత్తి కులాలపై ఆధారపడి బతుకుతున్నారని గుర్తుచేశారు. రూ.3లక్షల కోట్లకు పైబడి ఉన్న బడ్జెట్లో బీసీల గురించి కేవలం ఒక్క అంశం మాత్రమే ఉందని అన్నారు. సంవత్సరానికి బీసీలకు రూ.20వేల కోట్ల బడ్జెట్ అని ఎన్నికల ముందు ఊదరగొట్టారని.. కానీ ఇప్పటివరకు రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.
ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలో చేరుస్తామని చెప్పారు కదా.. ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.10 వేల కోట్ల విలువైన స్థలాలను కేసీఆర్ కేటాయించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావనే లేదని మండిపడ్డారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నిధులు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. కనీసం నామినేటెడ్ పదవులు కూడా బీసీలకు ఇవ్వడం లేదని అన్నారు. సబ్ ప్లాన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రజలను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎద్దేవా చేవారు.
మీ ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనలకు ఎవరికి కావాలని ప్రశ్నించారు. మీ ఫ్యూచర్ సిటీతో బీసీల ఫ్యూచర్ మారుతుందా అని ప్రశ్నించారు. బీసీలకు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎటుపోయిందని ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లకు రక్షణనిస్తూ, పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎవరికి కేటాయించిందని అడిగారు. మన పదవులు మనకే రావాలని తెలంగాణ తెచ్చుకుంటే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి మన పదవులను ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనీ బీసీ సమాజం క్షమించదని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీసీలకు మరిన్ని మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.