హైదరాబాద్ జూన్1 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. అబద్ధాలు చెప్పి, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాలను మో సం చేసిందని నిప్పులు చెరిగారు. కాం గ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని స్పష్టంచేశారు. అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాం స్కృతిక వేడుకలకు శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధిపథంలో ముందుకు సాగిందని వివరించారు. ఐటీతోపాటు అన్నిరంగాలు గణనీయంగా అభివృద్ధి సాధించాయని చె ప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారంలోకి రావ డం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సమున్నతమైన తెలంగాణ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కన్సల్టెంట్ జనరల్ ఆఫ్ ఇండియా రమేశ్‌బాబు, పద్మశ్రీ అవార్డీ విఠలాచార్య, సెనేటర్ షాన్స్టీల్, జార్జియ ప్రతినిధి జోన్స్, కార్టర్, ప్రొటెం మేయర్ దిలీప్ తుంకి, కౌన్సిల్ మెంబర్ బోబ్ ఎర్రమిల్లి, జాన్స్‌క్రీక్, సిటీ పోలీస్ చీఫ్ మార్క్ మిచెల్ తదితరులు పాల్గొన్నారు.