Home Guards | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఆశలు పెంచుకున్న మరో ఉద్యోగ వర్గానికీ తీరని అన్యాయమే మిగులుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఏడాది పాలనలో కేవలం రూ.79 డీఏ పెంచి, రూ.1,000 పెంచినట్టుగా గొప్పలు పోతున్నది. వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 మాత్రమే పెంచి తమ జీవితాలను ఏదో ఉద్ధరించినట్టు పోజులు ఇస్తుందని పలువురు హోంగార్డులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా హోంగార్డులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రూ.79కే డీఏను పెంచి హోంగార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపర్చిందని మండిపడుతున్నారు. ఏడాదిలో కేవలం రూ.79 పెంచి బలవంతంగా క్షీరాభిషేకాలు చేయించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలువురు హోంగార్డులతో బలవంతపు క్షీరాభిషేకాలు దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఏండ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ వరాల జల్లు కురిపించారని గుర్తు చేసుకుంటున్నారు.
హోంగార్డులకు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంతగా నాటి కేసీఆర్ ప్రభుత్వం వేతనాలు ఇ చ్చిందని హోంగార్డులు గుర్తుచేసుకుంటున్నా రు. ప్రధాని మోదీ గతంలో పాలించిన గుజరాత్లో నేటికీ హోంగార్డులకు రూ.20,200 మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం నెలకు రూ.27,630 వేతనం అందుతున్నది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర , కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.22 వేల లోపే వేతనాలు ఉండటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు రూ.6 వేల జీతమే వచ్చేది. 2014 వరకూ వారి వేతనం రూ.9 వేలే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం హోదాలో 2014 డిసెంబర్ 5న హోంగార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలను 2015 ఏప్రిల్ నుంచి అమలుచేశారు.
నెలకు రెండుసార్లు పరేడ్ అలవెన్స్ పేరిట ఇస్తున్న రూ.28ని రూ.100కు పెంచారు. 2017 డిసెంబర్ 13న మరోమారు వారి జీతాన్ని సవరిస్తూ రూ.12 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులకు సైతం 30 శాతం పీఆర్సీ ఇవ్వడంతో వారి వేతనాలు అనూహ్యంగా రూ.27 వేలకు పెరిగాయి. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో సమానంగా 30 శాతం ప్రత్యేక అలెవెన్సును కేసీఆర్ ప్రకటించారు. దీంతో ట్రాఫిక్ హోంగార్డుల వేతనాలు పట్టణాలు, నగరాల వారీగా రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు పెరిగాయి.
కరోనా ముందు వరకు ప్రభుత్వం ప్రతి ఏటా యూనిఫాం అలవెన్సు కింద రూ.7,500 ఇచ్చింది. మహిళా హోం గార్డులకు ఆరు నెలల మెటర్నరీ సెలవులు ఇచ్చింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది. మరణాంతర కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే రూ.5 వేలను రూ. 10 వేలకు పెంచింది. నాడు హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాల కోసం ఏడాదికి రూ. 600 కోట్లుకు పైగా ఖర్చుచేసింది. నాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు హోంగార్డుల కు టుంబాలు గౌరవంగా బతుకుతున్నాయి.