హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును బంద్పెడితే బద్నాం అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, కేసీఆర్ కాదని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కల్వకుర్తి ప్రాజెక్టు పంపులు ఆన్ చేసినట్టుగానే కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌లు ఆన్ చేసి దిగువన ఉన్న రిజర్వాయర్లు నింపాలని కోరారు. ఆన్ చేయాల్సిన సమయంలో జూరాల లిఫ్ట్‌లు ఆన్ చేయలేదని విమర్శించారు. కల్వకుర్తి లిఫ్ట్‌లను ఆన్ చేయాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే మంగళవారం ఎందుకు ఆన్ చేశారని ప్రశ్నించారు.
చర్చకు రమ్మంటే ఢిల్లీకి జంప్
ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చ పెడితే తప్పించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారని శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్కు మైక్ కట్ చేయకుంటే చర్చకు తాము సిద్ధమని కేటీఆర్ ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. వ్యవసాయానికి ఏయే రాష్ర్టాల్లో ఎంత ఖర్చు చేశారో అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. విలువైన సమయాన్ని తిట్లతో వృథా చేయకుండా ప్రజలకు మేలు చేసేందుకు ఉపయోగించాలని హితవు పలికారు. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో అప్పుడు తెలుస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలిచే సత్తా ఉంటే వెంటనే ఆ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శుభప్రద్ పటేల్, బాలరాజ్యాదవ్ పాల్గొన్నారు.