మహబూబ్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేవిధంగా చూడాలని గాంధీ విగ్రహానికి (Gandhi statue)బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగరెస్ పాలనలో రైతులు, సామాన్య ప్రజలను ఎవరిని కదిలించిన ఆవేదనతో వాళ్ల బాధలు చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకులు తప్ప ఎవరు రాష్ట్రంలో సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ప్రభుత్వ పాలనపై వ్యతిరేకంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పబ్బం గడుపు కునేందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల నుంచి దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో ప్రభుత్వంలో ఉన్నవాళ్లకే స్పష్టత లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒక మాట.. మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయవద్దని హితవు పలికారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.